కరీంనగర్‌లో అరుదైన ఘటన జరిగింది. గుండె కొట్టుకోక సీరియస్ కండిషన్లో ఉన్న మూడు రోజుల పసికందుకు మళ్లీ ప్రాణం పోశారు 108 అంబులెన్స్ సిబ్బంది. సీపీఆర్ ప్రక్రియ ద్వారా హృదయ స్పందన కలిగేట్టు చేసి చిన్నారిని బతికించారు.
వివరాల్లోకి వెళితే.. మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళ.. మూడు రోజుల క్రితం బాలుడికి జన్మనిచ్చింది. అయితే.. బాబుకు అనారోగ్యం కారణంగా మంగళవారం కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్పించారు. బాబు పరిస్థితి విషమించడంతో.. వరంగల్ తీసుకువెళ్లాలని వైద్యుల సూచించారు. కరీంనగర్ నుంచి వరంగల్ కు అంబులెన్స్‌లో బాలుడిని తరలిస్తుండగా.. మార్గమధ్యంలో బాలుడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.
వెంటనే 108 సిబ్బంది సమయస్పూర్తితో వ్యవహరించారు. సీపీఆర్ విధానంతో చెస్ట్ కంప్రెషన్ ద్వారా హృదయ స్పందన కలిగేట్టు చేశారు. హార్ట్ బీట్ నార్మల్ స్థితిలోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.