భట్టి సెకండ్ ప్లేస్‌లో లేరు.. పొంగులేటి తెలంగాణలో డీకే శివ కుమార్ పాత్ర పోషిస్తున్నారు
కర్ణాటకలో డీకే శివ కుమార్‌లా ఒక మంత్రి ఇక్కడ పెద్ద పాత్ర పోషిస్తున్నాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 20 Aug 2024 4:47 PM IST
కర్ణాటకలో డీకే శివ కుమార్‌లా ఒక మంత్రి ఇక్కడ పెద్ద పాత్ర పోషిస్తున్నాడని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి తెలంగాణలో డీకే శివ కుమార్ పాత్ర పోషిస్తున్నాడని.. ఆయన ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడని అర్ధమవుతుందని అన్నారు. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటి వచ్చిందన్నారు. భట్టి ఉప ముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్‌లో లేరు అన్నారు.
అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి.? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వం తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఖర్చు అవుతుంది.? వచ్చిన పెట్టుబడుల్లో ఎవరెవరు ఎంత పెడ్తున్నారు.? వీటి అన్నింటి మీద స్పష్టత ఇవ్వాలన్నారు.
మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదన్నారు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉందన్నారు. తన వెంట కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని భయపడి పొంగులేటికి కాంట్రాక్టు ఇచ్చారా.? సీఎం సమాధానం చెప్పాలన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడిందని.. అందుకే ఇవన్నీ చేస్తున్నారా.? కొంత మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకొని పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా.? దేనికోసం ఏఐసీసీ సీఎంపై ఫ్రెషర్ పెట్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్టు ఇచ్చింది? ఈ విషయం స్వయంగా ఒక మంత్రి నాకు చెప్పారని బాంబు పేల్చారు. కాంగ్రెస్ లో కుర్చీలాట నడుస్తోందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కన్న కిస్సా కుర్చీ మీద నడుస్తోందని.. అత్త ఆస్తి అల్లుడు పంచినట్టు కాంట్రాక్టు ఇస్తున్నారని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సగభాగం పొంగులేటికి ఇవ్వడం సరైన విధానము కాదన్నారు.
ఢిల్లీలో కప్పం కట్టేందుకు కాంట్రాక్ట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. ఆరోపణల మీద నిజ నిర్దారణ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందన్నారు. కాంగ్రెస్ కు పొంగులేటి వల్ల ముప్పు ఉందన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదలిక మీద మాకు అనుమానం ఉందన్నారు. మొన్నటి దాకా మేఘా మీద మాట్లాడానని.. ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసు ఇచ్చిందని తెలిపారు. ఇది మా బీజేపీ విజయం అన్నారు.