టీఆర్ఎస్, బీజేపీయేతర పక్షాలు భేటీ : ఇకపై సీరియస్ గా పోరాటం అంటున్నారు
All Party Leaders Meet At Gandhi Bhavan. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలు, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ యేతర పక్షాలతో
By Medi Samrat
జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలు, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ యేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యాచరణ కమిటీ సమావేశంలో తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్ రెడ్డి (సీపీఐ), కోదండరాం (టీజేఎస్), రంగారావు (సీపీఐ ఎంఎల్), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటిపార్టీ), గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ), మధు యాష్కీ (టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్), మల్లు రవి (టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భూమి సమస్యలు, భూ సేకరణ సమస్యలు, ధరణి వెబ్సైట్ సమస్యలపై చాలా సీరియస్ గా పోరాటం చెయ్యాలని నిర్ణయించామని అన్నారు. 22వ తేదీన ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాలో రైతులను, బాధితులను సమీకరించి.. పెద్దఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
27న భారత్ బంద్ కు సంబంధించి పార్లమెంటరీ వారీగా కమిటీ లు వేసుకొని ప్రిపేటరీ సమావేశాలు పెట్టి పెద్ద ఎత్తున బంద్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. బంద్ విజయవంతం చేసేందుకు అన్ని మన రాజకీయ పక్షాలు పని చేయాలని పిలుపునిచ్చారు. 22న మహా ధర్నా తరువాత రోజు నుంచి.. 27 వరకు బంద్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అన్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్న ప్రధాన రహదారులపై ఒక్కో ముఖ్య నాయకులు లీడ్ చేసి ప్రోగ్రోమ్ ప్లాన్ చెయ్యాలని అన్నారు.
ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రజలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్ లో పాల్గొనేలా ప్రణాళిక చెయ్యాలని కోరారు. 30వ తేదీన ప్రతిపక్ష పార్టీలు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని.. ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 5వ తేదీన పోడు భూముల సమస్యలపై ఆయా ప్రాంతాలలో 400 కిలోమీటర్ల కనెక్టింగ్ కారిడార్ లో ఉద్యమం చేపట్టాలని సూచించారు. ఆదిలాబాద్ నుంచి అశ్వరావుపేట వరకు పోడు రాస్తారోఖో చేపట్టనున్నట్టు కార్యాచరణను ప్రకటించారు.