మునుగోడు ఉపఎన్నికకు ముందు బీజేపీకి షాక్ ఇస్తూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ గురువారం పార్టీని వీడారు. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని మర్రిగూడలో ఫ్లోరైడ్ బాధితుల కోసం 300 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని 2016లో అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇచ్చిన హామీని బీజేపీ నెరవేర్చలేదని మాజీ శాసనసభ్యుడు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న వివక్ష, అన్యాయంతో నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని కూడా ఆయన అన్నారు.
''బీజేపీలో కొనసాగే ప్రసక్తే లేదు. తెలంగాణకు బీజేపీ అండగా ఉంటుందన్న భరోసాతో పార్టీలో చేరాను. బీజేపీలో చేరినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. బీసీ నాయకుడిని పట్టించుకునే వారు బీజేపీలో లేరు.'' అని బిక్షమయ్య పేర్కొన్నారు. ఆలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఎన్నికైన బూడిద బిక్షమయ్య గౌడ్ 2019లో టీఆర్‌ఎస్‌లో చేరి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేస్తూ సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. యాదాద్రి దేవాలయానికి నయాపైసా సాయం చేయలేదన్నారు.
'తెలంగాణ పట్ల బీజేపీ వివక్ష చూపుతోంది. బడుగు, బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. బీజేపీ చేస్తున్న వివక్ష, అన్యాయాన్ని చూసి రాజీనామా చేస్తున్నా. ఇంకా బీజేపీలో కొనసాగితే అర్థం లేదు. ప్రధాని, కేంద్ర మంత్రులందరూ డబుల్ ఇంజిన్ సర్కారు అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అనడమే తప్ప ఒక్క పైసా అదనంగా ఇవ్వట్లేదు. రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం పట్టులేదు. శాంతి వాతావరణం చెడగొట్టేలా నేతలు మాట్లాడుతున్నారు' అని భిక్షమయ్యగౌడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.