వరంగల్‌తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు: కేంద్రమంత్రి

రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on  27 Nov 2024 6:47 AM IST
Airports, Warangal, Union Minister Rammohan Naidu, Telangana, CM Revanth

వరంగల్‌తో పాటు ఆ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు: కేంద్రమంత్రి

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల ఏర్పాటు విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లో భూసేకరణ పూర్తి కాగానే వీలైనంత త్వరగా పనులు చేపడుతామని తెలిపారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ జిల్లాల్లోనూ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం డెవలప్‌మెంట్‌కు పెద్దపీట వేస్తున్నట్టు పేర్కొన్నారు.

అంతకుముందు తెలంగాణలో రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకివిజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్ల‌ను భార‌త విమాన‌యాన సంస్థకి అంద‌జేసినట్టు తెలిపారు.

తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌, రాష్ట్రానికి చెందిన అందుబాటులో ఉన్న ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌.. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడితో కలిసి చర్చించారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించిందని ముఖ్యమంత్రి వివరిస్తూ, వరంగల్‌తో పాటు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్‌లలో ప్రతిపాదిత విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రికి నివేదించారు.

వరంగల్ తో పాటు మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై వారితో చర్చించారు. ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి 150 కి.మీ దూరం ఉండాలన్న నిబంధన అడ్డురాదని, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జీఎంఆర్ సంస్థ నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందిన అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్ర‌య ఏర్పాటుకు గ‌తంలో గుర్తించిన స్థ‌లం అనువుగా లేనందున ప్ర‌త్యామ్నాయంగా పాల్వంచ‌లో 950 ఎక‌రాలు గుర్తించినట్టు సీఎం వివరించారు. ఆ భూమి వివ‌రాలు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు అంద‌జేశామ‌ని, వెంట‌నే విమానాశ్ర‌య ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో గ‌తంలో గుర్తించిన భూమి విమానాశ్ర‌య నిర్మాణానికి అనువుగా లేద‌ని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ స‌ర్వేలో తేలిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, అందుకు ప్ర‌త్యామ్నాయంగా అంత‌ర్గాంలో 591.24 ఎక‌రాలు గుర్తించామని, దానిపై తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు.

ఆదిలాబాద్‌లో భార‌త వైమానిక ద‌ళం (ఐఏఎఫ్‌) ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే 369.50 ఎక‌రాల భూమి ఉంద‌ని, పూర్తి స్థాయి కార్య‌క‌లాపాల‌ విస్తరణకు అద‌నంగా 249.82 ఎక‌రాలు అవ‌స‌ర‌మ‌ని, అదనంగా అవసరమైన భూమిని సేకరించి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

Next Story