కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా అప్పక్‌పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు చీరలు అందజేస్తామని సీఎం ప్రకటించారు. "రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో మొత్తం 67లక్షల మంది ఉన్నారు. ఈ సభ్యులకు ఇకపై రూ. 1000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు మంచి చీరలు ఇస్తాం. శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటును మహిళలు నిర్వహించబోతున్నారని సీఎం చెప్పారు.
మొదట ప్రతి జిల్లాలో ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండేలా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు లేకపోయినా, వసతులు సరిగా లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లండి. నిధులు నేనిస్తా.. నిర్వహణ మీ చేతుల్లో ఉంటుంది. నిధులు ఇచ్చినా నిర్వహణ బాగాలేకపోతే ప్రయోజనం ఉండదు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిస్తున్నామో బడి కూడా అలాగే నిర్వహించాలి" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని, వారు ఆత్మగౌరవంతో బ్రతుకుతారని తమ ప్రభుత్వ గాఢంగా నమ్ముతోందని సీఎం అన్నారు. అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ప్రోత్సహిస్తుందని సీఎం చెప్పారు.