ఓయూ జర్నలిజం విభాగంలో AI నైపుణ్యాలకు సంబంధించి సుధాకర్ ఉడుముల వర్క్‌షాప్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీడియా వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ ఉంది. కృత్రిమ మేధస్సు కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి.
By Medi Samrat
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీడియా వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తూ ఉంది. కృత్రిమ మేధస్సు కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. విద్యార్థులను వీటన్నింటికీ సిద్ధం చేయాలనే లక్ష్యంతో గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగంలో ఒక రోజు(గురువారం) AI వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సెషన్ ADIRA (AI ఫర్ డిజిటల్ రెడీనెస్ & అడ్వాన్స్‌మెంట్)లో భాగంగా నిర్వహించారు. దీన్ని AI ఆపర్చునిటీ ఫండ్: ఆసియా-పసిఫిక్ ద్వారా ప్రారంభించారు. దీనికి Google.org, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ మద్దతు ఇస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం DataLEADS మద్దతుతో నిర్వహిస్తూ ఉంది.
ఈ వర్క్‌షాప్‌కు సీనియర్ జర్నలిస్ట్, ఫ్యాక్ట్-చెక్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి ఉడుముల నాయకత్వం వహించారు. ఆయన హైదరాబాద్‌లోని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్స్)గా ఉన్నారు. పరిశోధనాత్మక జర్నలిజం, యుద్ధ ప్రాంతాల నుండి రిపోర్టింగ్‌లో 28 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న సుధాకర్ రెడ్డి ఉడుముల ఈ సెషన్ లో ఎన్నో విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు.
వాస్తవ ప్రపంచ ఉదాహరణలను వివరించారు సుధాకర్ రెడ్డి ఉడుముల. జర్నలిజంలో AI టూల్స్ ఉపయోగాలు, ప్రభావవంతమైన ప్రాంప్ట్‌లను ఎలా రూపొందించాలో, జనరేటివ్ AI ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. డీప్‌ఫేక్‌లను గుర్తించడం, మల్టీమీడియా కంటెంట్‌ను ధృవీకరించడం, న్యూస్‌రూమ్‌లలో AI ద్వారా ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడం వంటి పద్ధతులను విద్యార్థులకు పరిచయం చేశారు.
ఈ సెషన్ లో AI ప్రయోజనాలపై మాత్రమే కాకుండా దాని పరిమితులపై కూడా దృష్టి సారించారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం, ఎడిట్ చేసిన విజువల్స్ ను గుర్తించడంపై పలు సలహాలు, సూచనలు అందించారు. AI సాధనాలను బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని, వాస్తవాలను ధృవీకరించడంలో తీసుకోవాల్సిన నిర్ణయాల ప్రాముఖ్యతను కూడా సుధాకర్ రెడ్డి ఉడుముల వివరించారు.
ఫ్యూచర్ ఏజెంట్ AI గురించి, ప్రస్తుత AI సాధనాలతో ఏర్పడే సమస్యల గురించి, మనం ఊహించుకునే అంశాలు లాంటి వాటి గురించి చర్చించారు. AI-సహాయక వర్క్‌ఫ్లోల నుండి AI-ఇంటిగ్రేటెడ్ మోడల్‌లకు ఎలా మారుతుందో కూడా ఆయన వివరించారు.
శిక్షణ పూర్తయిన 50 మందికి పైగా విద్యార్థులు సర్టిఫికెట్‌లను అందుకున్నారు. ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, హ్యాండ్స్-ఆన్ టాస్క్స్ ఈ సెషన్‌లో భాగంగా ఉన్నాయి. భారతదేశంలో నిజాన్ని ప్రజలకు తెలియజేయడానికి జర్నలిజం ఓ ముఖ్యమైన రంగం. అలాంటి రంగాలలో పని చేస్తున్న వారు AI మీద అవగాహన చాలా ముఖ్యమని తెలియజేయడం ఈ వర్క్‌షాప్ లో భాగం.