అనుమతులు ఇక సులభం..రాష్ట్రంలో అమల్లోకి నూతన అప్లికేషన్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అప్లికేషన్ ‘బిల్డ్ నౌ’ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
By Knakam Karthik
అనుమతులు ఇక సులభం..రాష్ట్రంలో అమల్లోకి నూతన అప్లికేషన్
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అప్లికేషన్ ‘బిల్డ్ నౌ’ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ అధునాతన అప్లికేషన్ బిల్డ్‌నౌను సీఎం రేవంత్ రెడ్డి మార్చి 20న ప్రారంభించారు. కాగా హైదరాబాద్ మహానగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఏఐ ఆధారిత వ్యవస్థ ప్రస్తుతం బల్దియాలోనూ అమల్లోకి వచ్చింది. పాత విధానంలో అనుమతుల జారీలో జాప్యం జరుగుతుందని గుర్తించి టీజీ బీపాస్ విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకతను పెంచి మరింత సులభతరం చేసేందుకు దాని స్థానంలో బిల్డ్ నౌ విధానాన్ని ప్రవేశపెట్టింది. కృత్రిమ మేథ(ఏఐ), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేలా బిల్డ్‌నౌ ఫ్లాట్‌ఫాంను రూపొందించారు.
500 చదరపు మీటర్ల లోపు విస్తీర్ణంలో నిర్మించుకునే భవనాలన్నింటికి 15 రోజుల్లోనే అనుమతులు జారీ చేయనున్నారు. అంతకుమించిన విస్తీర్ణంలో నిర్మించుకునే భవనాలకు 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా గడువు విధించారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను కొనసాగించారు.
'ఏఐ'తో బిల్డ్ నౌ పని చేస్తోంది ఇలా..
బిల్డ్ నౌ విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థతో పాటు బ్లాక్ చైన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీని వినియోగించారు. దరఖాస్తు దారులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రక్రియను సులభంగా అర్థం చేసుకునేందుకు ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, ఉర్దూలోనూ అవకాశం కల్పించారు. ఇక సైబర్ నేరగాళ్లు బిల్డ్ నౌ లోని సమాచారాన్ని చోరీ చేయకుండా బ్లాక్ చైన్ సాంకేతికతను వినియోగించారు. ఇంటి నిర్మాణ స్థలం, లేఅవుట్ల సరిహద్దులను తెలుసుకునేందుకు జీపీఎస్ ఆధారిత చిత్రాలను పొందుపర్చాల్సి ఉండటంతో ఆక్రమణలను నివారించే అవకాశం ఉంది. అప్లికేషన్ స్టాటస్ ఏ స్థితిలో ఉందో ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. దరఖాస్తులోని లోపాలు, పొరపాట్లను గుర్తించి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. భవన నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్, పరిశీలనకు గతంలో గంటల తరబడి సమయం తీసుకోగా ప్రస్తుతం ఏఐ ఆధారంగా 5 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుంది.