అడ్మిషన్లు లేవు.. బోర్డు ఉంది ప్రైవేట్ స్కూలు ముందు కాదు..!
‘Admissions Closed’ board displayed at Govt school in Karimnagar. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను
By Medi Samrat Published on 25 Jun 2022 8:04 PM IST
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వం కృషి ఫలించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. కార్ఖానగడ్డ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు పాఠశాలకు అడ్మిషన్స్ కోసం వస్తూ ఉండగా.. "ప్రవేశములు లేవు" అని బోర్డు పెట్టవలసి వచ్చింది. పెద్ద నగరాల్లోని ప్రసిద్ధ కాన్వెంట్ పాఠశాలల్లో "అడ్మిషన్ లేదు" లేదా "అడ్మిషన్లు ముగిశాయి" అనే సందేశాలను ప్రదర్శించడం సాధారణ దృశ్యం.. అయితే కార్ఖానగడ్డలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ల కోసం అధిక సంఖ్యలో రావడంతో.. పాఠశాల అధికారులు ఎన్‌రోల్‌మెంట్‌ను మూసివేయవలసి వచ్చింది.
పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకు అడ్మిషన్ల కోసం తెగ ఫోన్స్ వస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుల నుండి కూడా తెగ ఫోన్స్ వస్తుండడంతో స్కూల్స్ లో పని చేసే వారు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా స్థానిక కార్పొరేటర్లు, అడ్మిషన్ల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమైన పది రోజుల్లోనే 150 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్చుకున్నారు. కొత్త అడ్మిషన్లతో పాఠశాల మొత్తం సంఖ్య 360కి చేరుకుంది. నాలుగు, ఐదవ తరగతులలో 90 మంది విద్యార్థులు ఉండగా, ఒకటవ తరగతిలో 60 మంది ఉన్నారు. రెండవ తరగతి 65, మూడవ తరగతి 50 విద్యార్థులు ఉన్నారు. ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోలేక పాఠశాల అధికారులు మూడు రోజుల క్రితం 'అడ్మిషన్ క్లోజ్డ్' అనే బోర్డును ప్రదర్శించారు.
విద్యార్థులను సెక్షన్స్ లాగా విభజించేందుకు తగిన తరగతి గదులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది పిల్లల సంరక్షణకు అందుబాటులో ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు. ప్రధానోపాధ్యాయుడు కె.బద్రునాయక్ మాట్లాడుతూ.. ఈసారి మాత్రమే కాకుండా ఆరేళ్ల క్రితం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రతి ఏటా ఇదే సమస్య ఎదురవుతున్నదన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ, బొమ్మకల్, లక్ష్మీపూర్, కిసాన్‌నగర్, అశోక్‌నగర్‌కు చెందిన విద్యార్థులు పాఠశాలలో చేరుతున్నారు. కిసాన్‌నగర్, అశోక్‌నగర్‌లలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ ఖార్‌ఖానగడ్డ ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.