రూ. కోట్లు విలువ చేసే సైబర్ నేరం భగ్నం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ నేరాలు చేస్తూ కోట్ల రూపాయ‌ల‌ డబ్బులు దండుకుంటున్న నిందితులపై అదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది.

By Medi Samrat
Published on : 23 Jun 2025 1:52 PM

రూ. కోట్లు విలువ చేసే సైబర్ నేరం భగ్నం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్

సైబర్ నేరాలు చేస్తూ కోట్ల రూపాయ‌ల‌ డబ్బులు దండుకుంటున్న నిందితులపై అదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్ర‌మంలోనే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్‌లో ఇద్దరు సైబ‌ర్ నేర‌గాళ్ల‌ను పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ వివ‌రాల‌ను వెల్లడించారు. ప్రతిరోజూ 70 మంది బాధితులకు మెసేజ్‌లు పంపుతూ, నెల రోజులలో దాదాపు 900 మందికి డబ్బు పంపించి వారిని వలల్లో దించే ప్రయత్నం చేస్తుంటారు.. ఈ ముఠా ఏర్పాటు చేసిన గ్రూప్ నందు జాతీయంగా 250 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామ‌ని.. ప్రతిరోజూ జనం లక్షల్లో మోసపోతున్నార‌ని.. ఈ కేసుకు సంబందించి జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న నింధితులను పట్టుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం, తికమ్‌గఢ్ జిల్లాకు చెందిన సౌరభ్ రాయక్వార్(A1), రితిక్ సేన్(A2) అనే నిందితులను కమిషన్ ఏజెంట్లుగా వాడుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటారని.. అమాయకులను వాట్సాప్ ద్వారా వర్క్ ఫ్రం హోం, తక్కువ డబ్బులతో, తక్కువ సమయంలో, ఎక్కువ లాభం సంపాదించవచ్చు అంటూ మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్ లు, ఒక లాప్ టాప్, బ్యాంకు పాస్ బుక్స్, కీబోర్డ్, మానిటర్, పాన్ కార్డు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.

ఈనెల 14న బాధితుడు చెన్న శివకుమార్ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా రూ 5,03,000/- పోగొట్టుకున్నట్లు 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా.. ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ క్ర‌మ‌లోనే ఘరానా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లకు కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్న ఈ ఇరువురు అమాయ‌కుల‌ను ఎలా ముగ్గులోకి దించుతారో వివ‌రించారు.

హాయ్ నా పేరు టీనా అంటూ వాట్సాప్ ద్వారా అమాయకులకు మెసేజ్ చేస్తూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇంట్లోనే ఉంటూ రోజుకు రూ.2,000 నుండి రూ.8,000 వరకు సంపాదించవచ్చని నమ్మబలుకుతూ, టాస్కులను కేటాయించి.. టాస్కులను పూర్తి చేసిన తర్వాత మొదటిసారి 150 రూపాయల నుండి 450 రూపాయలను బాధితులకు పంపి, వారిని టెలిగ్రామ్ ద్వారా ఎక్కువ డబ్బులను సంపాదించవచ్చు అని న‌మ్మ‌బ‌లుకుతూ.. ఒక సైబర్ అకౌంట్లో వారు చేసిన టాస్కులకు సంబంధించిన డబ్బును చూపిస్తూ వాటిని తీసుకోవాలంటే మరింత డబ్బు జమ చేయాలంటూ విడతలవారీగా డ‌బ్బులు వ‌సూలు చేస్తారు. అలాగే.. బాధితుడు చెన్న శివకుమార్ వద్ద నుండి కూడా రూ 5,03,000/- వసూలు చేసిన‌ట్లు ఎస్పీ వివరాలను వెల్లడించారు.

ప్రధాన సూత్రధారులైన మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేయడానికి జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత సైబర్ నేరగాళ్లు చేయమన్న పనులు, టాస్కులను చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను ఆశించడం వల్ల ఉన్న డబ్బులను కోల్పోవడం జరుగుతుందని వారి వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్ల పాత్ర పెరిగిపోతున్న సందర్భంలో ప్రజలు అప్రమత్తతతో ఉండటం శ్రేయస్కరమని తెలిపారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 కు సంప్రదించాలని లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సంప్రదించాలని తెలిపారు. డబ్బులను పోగొట్టుకున్నట్లయితే వెంటనే గోల్డెన్ హవర్ ఒక గంటలోపు సంప్రదించినట్లయితే పూర్తి డబ్బులను తిరిగి రాబట్టే అవకాశం ఎక్కువగా ఉన్నదని తెలిపారు.

వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించ వచ్చు అనే ప్రకటనల ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వాటిని తిరస్కరించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వెబ్‌సైట్లు, తెలియని అప్లికేషన్లను మొబైల్ ఫోన్లలో వినియోగించకుండా ఉండటం శ్రేయస్కరమని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫ్రాడ్, స్టాక్ మార్కెట్ ఫ్రాడ్, వర్క్ ఫ్రం హోం ఫ్రాడ్, ఏపీకే ఫైల్స్ లాంటివి చలామణిలో ఉన్నట్టు వాటి వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్సై వి విష్ణువర్ధన్, నవనీత్, సంజీవ్, మండల్ సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story