ఆ అంశంపై రాహుల్ గాంధీతో చర్చించాను : పూనమ్ కౌర్

Actress Poonam Kaur walks with Rahul Gandhi during Bharat Jodo Yatra. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నేడు నటి పూనం కౌర్ పాలుపంచుకున్నారు.

By Medi Samrat  Published on  29 Oct 2022 7:15 PM IST
ఆ అంశంపై రాహుల్ గాంధీతో చర్చించాను : పూనమ్ కౌర్

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నేడు నటి పూనం కౌర్ పాలుపంచుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతున్న ఈ యాత్రలో శనివారం పూనం కౌర్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఆమె కొంత దూరం నడిచారు కూడా. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో తానేం చర్చించానన్న విషయాన్ని శనివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనం వెల్లడించారు. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీ పన్నును రద్దు చేయాలన్న అంశంపై తాను రాహుల్ గాంధీతో చర్చించానని పూనం చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు కోరుతూ అఖిల భారత పద్మశాలీ సంఘం గడచిన 8 నెలలుగా ఉద్యమం చేపడుతోందని.. ఆ ఉద్యమంలో తాను క్రియాశీలకంగా పాల్గొంటున్నానని తెలిపారు.

ఇందులో భాగంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు కోసం వీలయినంత ఎక్కువ మంది ఎంపీల సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇప్పటిదాకా 11 పార్టీలకు చెందిన 66 మంది ఎంపీల సంతకాలు సేకరించామన్నారు. రాహుల్ గాంధీ కూడా ఓ ఎంపీ అయినందున ఆయన సంతకాన్ని కూడా సేకరించేందుకే యాత్రకు వెళ్లానని ఆమె చెప్పారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ... తాను అధికారంలో ఉన్న తెలంగాణలో జీఎస్టీని రద్దు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న సందర్భంగా తాను సోనియా గాంధీ వస్త్రధారణ గురించి ఆయనతో మాట్లాడానని పూనం చెప్పారు. నిత్యం చేనేత చీరలను ధరిస్తున్న సోనియా గాంధీ అంటే తనకు ఇష్టమని చెప్పానని అన్నారు.


Next Story