ఖమ్మం లో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహం పై వివాదం నెలకొంది. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాము ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కు వ్యతిరేకం కాదని, కృష్ణుడు రూపంలో పెట్టడం సరికాదని అంటున్నారు. యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మే 28న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఖమ్మంలో ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై తమకి ఎలాంటి అభ్యంతరం లేదని.. మహానుభావుడి విగ్రహం పెట్టడం అందరికి ఇష్టమే అన్నారు. కానీ తారకరాముని విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయడంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆమె అన్నారు. ఎలక్షన్స్ వస్తుండటంతో ఓట్లకోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్టీఆర్ అంటే ఎన్నో పాత్రలు గుర్తుకు వస్తాయని, అటువంటి తారకరాముడిని కేవలం కృష్ణుడి రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.