ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ
Actor Sharath Kumar meet MLC Kavitha.ఎమ్మెల్సీ కవిత తో శరత్ కుమార్ భేటీ అయ్యారు
By తోట వంశీ కుమార్ Published on 28 Jan 2023 6:15 AM GMTభారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత తో సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సమావేశంలో ప్రస్తుత దేశ వ్యాప్త రాజకీయాలు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే భారత్ రాష్ట్ర సమితి పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి కవితను శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షునిగా ఉన్న శరత్‌కుమార్.. బీఆర్ఎస్ నాయకురాలు కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణ సమావేశమేనా..? లేక రాజకీయ కోణంలో సమావేశం జరిగిందా..? అన్న దానిపై క్లారిటి రావాల్సి ఉంది.
ఇక జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రారంభించగా వచ్చే నెలలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ ఖరారైంది. ఓ వైపు సభలు, సమావేశాలతో ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ గురించి తెలియజేస్తూ మరో వైపు ఇతర రాష్ట్రాల్లో నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నారు కేసీఆర్.
ఒడిశా రాష్ట్రంలో సీనియర్ లీడర్, మాజీ సీఎం గమాంగ్ కుటుంబంతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు సీనియర్ నేతలు, పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ సమయంలో కవితతో శరత్ కుమార్ భేటీ కావడం వెనుక తమిళనాట బీఆర్ఎస్ విస్తరణ వ్యూహ్యాలు ఉండొచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరీ బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసేందుకు శరత్ కుమార్ సిద్దంగా ఉన్నారా..? లేదా..? అన్నది కూడా తెలియాల్సి ఉంది.