గురునానక్ జయంతి సందర్భంగా సినీ నటి పూనమ్ కౌర్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూనమ్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈటలతో కలిసి శాంతికి గుర్తుగా పావురాలను పూనమ్ ఎగరవేశారు. శాంతికి చిహ్నమైన తెల్లటి దుస్తుల్లో పూనమ్ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఏక్ ఓంకార్ అనే పవిత్రమైన గుర్తను ఈటలకు పూనమ్ కానుకగా ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటములపై పూనమ్ మాట్లాడారు. ధర్మ యుద్ధం ఎప్పుడూ విజయం పొందుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వతంత్ర్యం, స్వేచ్ఛ వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అన్నారు.
మంచివాళ్లను, నిబద్ధత గల వారిని బాబా నానక్ ఆశీర్వదిస్తారని పూనమ్ తెలిపింది. బాబా నానక్ తన నమ్మకం అని, ఆయన తనను రక్షిస్తుంటారని చెప్పుకొచ్చింది. అయితే పూనమ్ కౌర్ ఇంత సడన్‌గా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ని కలవడంపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. పూనమ్ కౌర్ బీజేపీలో చేరనుందా అంటూ గుసగుసలు వినబడుతున్నాయి. పూనమ్ కౌర్ పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్‌తో నానుతూనే ఉంటుంది. 2006లో వచ్చిన మాయజాలం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పటి నుండి ఆడపా దడపా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. పూనమ్ ఎక్కువగా సినిమాల్లో కన్నా.. వివాదాల్లో కనిపిస్తుంటారు.