సంధ్య థియేటర్ తొక్కిసలాల ఘటనలో ఇటీవల రెగ్యులర్ బెయిల్ పొందిన సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్.. సంతకం చేసిన బెయిల్ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. కోర్టుకు అల్లు అర్జున్ వచ్చినట్లు తెలియడంతో భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పలువురు అతనితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే, పోలీసులు వారిని వారించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ. 50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది. రెండు నెలలపాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ శనివారం నాంపల్లి కోర్టుకు వచ్చి పూచీకత్తు పత్రాలు సమర్పించారు.