తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ప్రలోభాల కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టు సాయంత్రం ఉత్తర్వులు ఇవ్వనున్నందున విచారణను వాయిదా వేయాలని నిందితుల తరపు న్యాయవాది ధర్మసనాన్ని కోరారు. ఈ క్రమంలో స్పందించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోదాలు కొనాసగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, కర్ణాటకతోపాటు హైదరాబాద్ లోనూ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏడు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్న సిట్ అధికారులు.. హర్యానాలో రామచంద్రభారతి నివాసంతో పాటు కర్ణాటకలో ఆయనకు సంబంధించిన ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని నందకుమార్ కు చెందిన ఇల్లు, హోటల్ లో సోదాలు చేశారు. కేరళలోని కొచ్చిలో ఉండే ఓ వైద్యుడు రామచంద్రభారతికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి బంధువు తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి సింహయాజీకి విమానం టికెట్ బుక్ చేసినట్లు సిట్ గుర్తించింది.