నేటి నుంచి 5 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ.. గడువు తర్వాత కూడా ఛాన్స్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు పథకాలను ఒకే దరఖాస్తులో అర్జీ పెట్టుకోవచ్చు.

By అంజి  Published on  28 Dec 2023 7:18 AM IST
guarantee applications, Telangana, Congress Govt, CM Revanth Reddy

నేటి నుంచి 5 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ.. గడువు తర్వాత కూడా ఛాన్స్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల కోసం నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదు పథకాలను ఒకే దరఖాస్తులో అర్జీ పెట్టుకోవచ్చు. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్‌లో మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇందులో ఏ పథకం కావాలనుకుంటే దానికి అవసరమైన వివరాలు మాత్రమే నింపాలి. దానికి ఆధార్‌, రేషన్‌ కార్డు కాపీలు జతపర్చడం తప్పనిసరి. నేటి నుంచి ఏర్పాటు చేసే గ్రామ సభల్లో వాటిని సమర్పించాలి.

అయితే రేషన్‌ కార్డు లేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేషన్‌ కార్డు లేకపోయినా పథకాల కోసం అప్లై చేసుకోవచ్చని, వాళ్లనూ పథకాల కోసం పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. అలాగే రేషన్‌ కార్డు కోసం కూడా అప్లికేషన్లు ఇవ్వొచ్చని తెలిపింది. త్వరలో రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని వివరించింది. కాగా నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ఐదు గ్యారెంటీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నారు. జనవరి 6 వరకు ఆయా గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో దరఖాస్తులు తీసుకుంటారు.

ఒకవేళ 6వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోలేకపోతే వాళ్లు ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చు. గ్యారెంటీలకు లబ్ధిదారులే స్వయంగా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి తరఫున ఎవరైనా ఇవ్వొచ్చు. దరఖాస్తులు తీసుకుంటున్న ఐదు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజా పాలన ద్వారా ప్రజలు ప్రభుత్వం వద్దకు రాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నామని చెప్పారు.

Next Story