తెలంగాణలో మరోసారి అవినీతి బట్టబయలైంది. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన అర్రమాడ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 2025 డిసెంబర్ 5న సృజనాత్మక మోడల్ స్కూల్ పునరుద్ధరణ ఫైల్ ప్రాసెసింగ్ కోసం రూ.60 వేలు లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా ఆయనను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
లంచం కేసు నమోదు చేసుకున్న అనంతరం వెంకట్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు నగదు, రెండు కేజీల బంగారం, బ్యాంక్ లాకర్ లో 42 లక్షలు, ఎల్బీనగర్లో లగ్జరీ ఇల్లు, విల్లా, 10 ప్లాట్లను గుర్తించారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన ఆస్తుల విలువ సుమారు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. ఇంకా హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.