ఏసీబీ రైడ్స్.. వామ్మో అన్ని కోట్ల రూపాయలా..?

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తోంది.

By Medi Samrat  Published on  24 Jan 2024 9:17 PM IST
ఏసీబీ రైడ్స్.. వామ్మో అన్ని కోట్ల రూపాయలా..?

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తోంది. వందల కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించింది. 14 టీమ్‌లతో బాలకృష్ణ ఇళ్లలో రైడ్ చేసింది ఏసీబీ. తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌ఆర్‌ఈఆర్‌ఏ) కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రూ. 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో బాలకృష్ణ నివాసం, బంధువుల ఇళ్లు, కార్యాలయాలు సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సమగ్ర సోదాలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సోదాలు ఇంకో రోజు కూడా కొనసాగవచ్చని భావిస్తున్నారు. నిందితుడు శివ బాలకృష్ణ, తన పదవిని ఉపయోగించుకుని భారీగా సంపదను కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. లెక్కల్లో చూపని ఆస్తులు కూడబెట్టినట్లు కేసు నమోదు చేశారు. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం, మాసబ్ ట్యాంక్‌లోని రెరా కార్యాలయంలో ఏసీబీ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బాలకృష్ణ నివాసంతో పాటు, కీలక ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు.

అధికారుల సోదాల్లో బంగారం, ఫ్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, బినామీ హోల్డింగ్స్ సహా రూ.100 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాలో రూ. 40 లక్షల నగదు, రెండు కిలోల బంగారు ఆభరణాలు, 60 చేతి గడియారాలు, ఆస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. అదనంగా, 14 ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు, వివిధ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను జప్తు చేశారు. బాలకృష్ణ బ్యాంక్ లాకర్లు, ఇతర ఆస్తులపై ఏసీబీ దృష్టి పెట్టింది. గురువారం నాడు కూడా దర్యాప్తు కొనసాగనుంది .

Next Story