రూ.8 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్

8 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వై మదన్ మోహన్ రెడ్డిలను ఏసీబీ అరెస్ట్ చేసింది.

By అంజి  Published on  13 Aug 2024 5:08 AM GMT
ACB, arrest, Rangareddy Joint Collector Bhupal Reddy , bribe, Dharani Portal

రూ.8 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్ 

హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వై మదన్ మోహన్ రెడ్డిలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. ఫిర్యాదుదారుడు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గుర్రంగూడ గ్రామానికి చెందిన జక్కిడి ముత్యంరెడ్డిగా గుర్తించినట్లు ఏసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

ధరణి వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు బాధితుడి నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌ రూ.లక్షలు డిమాండ్ చేశాడు. అధికారి మదన్‌మోహన్‌రెడ్డి తన కారులో రూ.8 లక్షలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చెప్పాడు. దీంతో ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్‌కు సీనియర్ అసిస్టెంట్ ఫోన్‌ చేయగా.. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడాడు.

జాయింట్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి తన అధికారిక వాహనంపై పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ సమీపంలోకి చేరుకుని మదన్‌మోహన్‌రెడ్డి వాహనం దగ్గర ఆగాడు. వెంటనే మదన్‌మోహన్‌రెడ్డి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచిన లంచం సొమ్మును తీసుకుని భూపాల్‌రెడ్డి కారులో డబ్బులు ఇచ్చి వాహనం దిగి వచ్చాడు. ఆ తర్వాత భూపాల్ రెడ్డి కారు నుంచి రూ.8 లక్షల లంచంను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ కారులో ఉన్న బ్యాగ్‌ నుంచి రికవరీ చేసిన సొమ్ముకు ఫినాల్‌ఫ్తలిన్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు తమ అధికారిక పదవిని దుర్వినియోగం చేశారు. వారిపై ఉన్న అధికారాలు, లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించారు. దీంతో నిందితులైన మదన్‌మోహన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డిలను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కేసు విచారణలో ఉందని అధికారులు తెలిపారు.

కాల్ ఫోన్ నంబర్ -1064 (టోల్ ఫ్రీ నంబర్)

ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ లంచం డిమాండ్ చేసినట్లయితే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీకి 1064 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ప్రజలను అధికారులు అభ్యర్థించారు.

Next Story