హైదరాబాద్: 'అభయహస్తం' పథకం కింద 2009 - 2016 మధ్య మహిళా సంఘాల సభ్యులు జమ చేసిన డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తోంది. 60 ఏళ్ల దాటిన మహిళలకు రూ.500 పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. మహిళలు ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లించారు. 2018లో ఈ పథకం నిలిచిపోయింది. దీంతో వడ్డీతో కలిపి ఆ డబ్బును తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేయనుంది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా సుమారు 400 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్షలో లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ శాఖ సెర్ప్‌కు బాధ్యతలు అప్పగించింది. దీంతో సెర్ప్.. గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్ట్‌ను పరిశీలించింది. బతికి ఉన్న వారి వివరాలు, మరణించిన సభ్యురాళ్ల వారసుల నుంచి బ్యాంకు అకౌంట్ల సమాచారం సేకరించింది. త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.