ఆధార్ అప్ డేట్ సేవలు.. అప్పటి వరకూ ఉచితమే..!
ఆధార్ అప్ డేట్ సేవలను ఉచితంగా పొందవచ్చు. సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి చార్జీ లేకుండా పౌరులు ఆధార్ సేవలను పొందొచ్చు.
By Medi Samrat Published on 4 Sep 2023 2:05 PM GMTఆధార్ అప్ డేట్ సేవలను ఉచితంగా పొందవచ్చు. సెప్టెంబర్ 14 వరకు ఎలాంటి చార్జీ లేకుండా పౌరులు ఆధార్ సేవలను పొందొచ్చు. సాధారణంగా ఆధార్ లో వివరాల మార్పులకు (అప్ డేట్) సంబంధించిన అభ్యర్థనలకు రూ.50 చార్జీగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటూ ఉంటుంది. అయితే మరో 10 రోజుల పాటు ఈ చార్జీలు లేకుండానే సేవలు పొందొచ్చు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, సంవత్సరం, లింగం, మొబైల్ నంబర్, ఈ మెయిల్ లో మార్పులు చేసుకోవచ్చు. ఆన్ లైన్ నుంచి రూపాయి చెల్లించకుండా ఈ సేవలను పొందొచ్చని యూఐడీఏఐ ప్రకటించింది. ఎవరైనా తమ ఫొటో లేదంటే ఐరిష్ లేదా బయోమెట్రిక్ వివరాలు మార్చుకోవాలంటే అందుకోసం సమీపంలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు వీటికి నిర్ధేశిత ఫీజులను కూడా చెల్లించాలి. బయోమెట్రిక్ వివరాల అప్ డేట్ కోసం అక్కడి సిబ్బంది అదనపు సమయం వెచ్చించాలి. వచ్చిన వ్యక్తి డెమోగ్రాఫిక్ వివరాలను తీసుకోవాలి. ప్రజలు ప్రతి పదేళ్లకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరుతోంది.
రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు సెప్టెంబర్ 30 లోగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్ లింక్ చేయాలని సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ గడువు లోగా ఆధార్ సీడింగ్ చేయకుంటే అక్టోబర్ నెల నుంచి రేషన్ కార్డు క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు మార్లు గడువు పొడిగించారు. ఇంకా ఎవరైనా ఆధార్ లింక్ చేయని వారు ఉంటే వెంటనే ఆ పని పూర్తి చేసుకోవాలి. రేషన్ కార్డుతో ఆధార్ కార్డు సీడింగ్ చేసుకోని ఖాతాదారుల రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది ప్రభుత్వం. ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వ డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలిగిపోతాయి. ఇప్పటికే అన్ని జిల్లాల పౌర సరఫరాల కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అందుకే రేషన్ కార్డులు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయాలని కోరుతోంది.