హోంవర్క్‌ చేయలేదని టీచర్‌ కర్కశత్వం.. తలలో రక్తం గడ్డలు కట్టి చిన్నారి మృతి

A teacher who beat him for not doing homework.. A child died.. An incident in Nizamabad. అభం శుభం తెలియని ఓ చిన్నారి పట్ల టీచర్‌ కర్కశంగా ప్రవర్తించింది. హోంవర్క్‌ ఎందుకు చేయలేదో కారణం తెలుసుకుని

By అంజి  Published on  7 Sep 2022 6:23 AM GMT
హోంవర్క్‌ చేయలేదని టీచర్‌ కర్కశత్వం.. తలలో రక్తం గడ్డలు కట్టి చిన్నారి మృతి

అభం శుభం తెలియని ఓ చిన్నారి పట్ల టీచర్‌ కర్కశంగా ప్రవర్తించింది. హోంవర్క్‌ ఎందుకు చేయలేదో కారణం తెలుసుకుని.. సర్ది చెప్పి ఇలా కాదు అలా చేయాలని చెప్పాల్సిన టీచర్‌ అమానవీయంగా వ్యవహరించింది. చిన్నారి ఇచ్చిన హోంవర్క్‌ చేయలేదని తెలియడంతో ఆగ్రహంగా.. చిన్నారిని టీచర్‌ కొట్టింది. టీచర్‌ వ్యవహరించిన తీరుతో చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అర్సపల్లికి చెందిన 7 ఏళ్ల చిన్నారి ఫాతిమా.. స్థానికంగా బోధన్‌ రోడ్డు ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఉన్న ఉడ్‌ బ్రిడ్జి స్కూల్‌లో సెకండ్‌ క్లాస్‌ చదువుతోంది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్‌ 2వ తేదీన చిన్నారి ఫాతిమా హెంవర్క్‌ చేయలేదని టీచర్‌.. ఆమెను తరగతి గదిలో సుమారు గంట పాటు బెంచీపై నిల్చొబెట్టింది. ఆపై స్కూల్‌ బ్యాగులో పుస్తకాలు ఉంచి బాలిక మెడపై మోయించినట్లు, చిన్నారి తలపై స్కేల్‌తో కొట్టినట్లు విద్యార్థుల ద్వారా తెలిసింది. ఆ తర్వాత ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని.. తమ కూతురిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

చిన్నారిని వైద్యులు పరీక్షించారు. చిన్నారి తలలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రిఫర్‌ చేశారు. వెంటనే బాలికను హైదరాబాద్‌ తీసుకొచ్చి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి మంగళవారం మృతి చెందింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కంటతడిపెట్టిస్తోంది. బాధిత బాలిక గత రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. తన కుమార్తెను కొట్టిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి ముజీబ్ ఖాన్.. నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story
Share it