ఒకే పేరుతో ఉన్న ఇద్దరు రోగుల మందుల చీటీ తారుమారు కావడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దోమకొండ మండల పరిధిలోని అంచనూరు గ్రామానికి చెందిన నాగ బాలరాజు (73) అనే వృద్ధుడు నరాల సమస్య, థైరాయిడ్ చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అదే సమయంలో అదే పేరుతో ఉన్న డయాబెటిక్ పేషెంట్ కూడా ఆసుపత్రికి వచ్చాడు. పేరు పిలిచినప్పుడు పొరపాటున నాగ బాలరాజు డాక్టర్ గదిలోకి వెళ్లగా వైద్యుడు వివరాలు సరి చూసుకోకుండా డయాబెటిక్ పేషెంట్‌కు ఇవ్వాల్సిన హై-డోస్ షుగర్ మందులను బాలరాజుకు రాసిచ్చారు.
వైద్యుడు రాసిచ్చిన మందులను వాడిన కొద్దిసేపటికే నాగ బాలరాజు ఆరోగ్యం క్షీణించింది. శరీరంలో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోవడంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకువెళ్లగా, కేస్ షీట్ మారిపోయిందని సిబ్బంది సమాధానం ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగ బాలరాజు మృతి చెందారు.