హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను తామే క్లియర్ చేశామని చెప్పారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై మంగళవారం నాడు ఖమ్మం కలెక్టరేట్‌లో భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజలు 1912కు కాల్ చేయాలని సూచించారు. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదని, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, పోల్స్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు.
2029–30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద ఉమ్మడి ఖమ్మం సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 26 లక్షల వినియోగదారులకు లబ్ధి చేకూరిందన్నారు. ఇది గడీల పాలన కాదని, ప్రజా పాలన అని భట్టి పేర్కొన్నారు. ఈ నెల 11న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు భూమి పూజలు చేస్తామన్నారు. మరోవైపు మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని ఆయన వెల్లడించారు.