కొడుకు జ్ఞాపకార్థం.. ఉచితంగా పెట్రోల్ అందించిన సూర్యాపేట వ్యక్తి

A man from Suryapet offered free petrol in memory of his dead son. తమ ప్రియమైన వారి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు పేదలకు లేదా అనాథ శరణాలయాల్లో ఉన్నవారికి భోజనం

By అంజి  Published on  1 Sep 2022 2:49 PM GMT
కొడుకు జ్ఞాపకార్థం.. ఉచితంగా పెట్రోల్ అందించిన సూర్యాపేట వ్యక్తి

తమ ప్రియమైన వారి వర్ధంతిని పురస్కరించుకుని కొందరు పేదలకు లేదా అనాథ శరణాలయాల్లో ఉన్నవారికి భోజనం పెట్టడానికి లేదా ఆసుపత్రులలో రోగులకు పండ్లు, ఆహారాన్ని పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే మునిసిపల్ పారిశుధ్య కార్మికులు, వికలాంగులు, హమాలీలు, పెయింటింగ్ కార్మికులు, శ్మశాన వాటికల్లో పనిచేసే వారితో సహా ఎంపిక చేసిన వ్యక్తులకు ఒక లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా పంపిణీ చేసే వినూత్న స్కీమ్‌తో ఒక వ్యాపారవేత్త తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలో చర్చనీయాంశమయ్యాడు.

అతడు అందిస్తున్న ఉచిత పెట్రోలు కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వందలాది మంది ప్రజలు పెట్రోల్‌ బంక్‌ వద్ద క్యూ వరుసలో నిలబడ్డారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని వ్యాపారవేత్త గండూరి ప్రకాష్ తన కుమారుడు ప్రీతం జోనా వర్ధంతి సందర్భంగా నిర్వహించారు. అతని పేరు మీద ఇప్పుడు ఫౌండేషన్ నడుస్తోంది. ప్రీతమ్ జోనా ఫౌండేషన్.. ఒక వాహనదారుడికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితం అని ప్రకటించింది. దీంతో వందలాది మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది .

మధ్యాహ్నం వరకు దాదాపు రూ.1.3 లక్షలతో 1200 మందికి పైగా ఉచిత పెట్రోల్ పంపిణీ చేశారు. సాయంత్రం వరకు ఉచిత పెట్రోలు స్కీమ్‌ అమలవుతుందని ప్రకాష్ తెలిపారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో ప్రజలు భారీ క్యాన్లను కూడా తీసుకుని పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. కానీ అది కొన్ని వర్గాల ప్రజలను మాత్రమే ఉద్దేశించినది అని వారికి చెప్పబడింది. పెట్రోల్ బంక్‌కు ఉచితంగా పెట్రోలు తీసుకునేందుకు ప్రజలు తమ తమ వాహనాలతో భారీగా తరలిరావడంతో జాతీయ రహదారి దిగ్బంధమైంది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

పెట్రోలు ఉచితంగా అందించడం పట్టణ ప్రజలకు కొత్త విషయం కావడంతో ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గండూరి ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలు కొనుగోలు సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పడుతుండడం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని వర్గాల వాహనాలకు ఉచితంగా పెట్రోల్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "మేము బాలికల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీని కూడా చేపట్టాము. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా ఆహారం అందించాము" అని ఆయన తెలిపారు.

Next Story