మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం
మేడారం జాతర పనులకు సంబంధించి నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
By - Knakam Karthik |
మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం
మేడారం జాతర పనులకు సంబంధించి నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. మేడారం గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరించిన గోవింద రాజు, పగిడిద్దరాజు గద్దెలపై నేడు ధ్వజ స్తంభాల పునఃప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నిన్న గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులు పూజ కార్యక్రమాలను సిద్ధం చేశారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు, కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు వారి గుడిల వద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించుకుని నిన్న రాత్రి మేడారానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో గోవిందరాజు, పగిడిద్దరాజు ధ్వజ స్తంభాలను నిలపనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి సీతక్క మేడారంలో బస చేశారు.
నేడు సమ్మక్క సారలమ్మ దర్శనాలు బంద్
ఈ నేపథ్యంలోనే నేడు సమ్మక్క సారలమ్మ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘ అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. బుధవారం గద్దెల ప్రాంగణంలో గోవిందా రాజు, పగిడిద్ద రాజుల ప్రతిష్టాపనతో పాటు విస్తరణ పనులు ఉన్నందున బుధవారం భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తమ దర్శనాలను ఒక రోజు వాయిదా వేసుకోవాలని కోరారు. మరో వైపు మహా జాతరకు సమయం సమీపిస్తుండటంతో మేడారం అభివృద్ధి పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమ్మక్కసారలమ్మల గద్దెల వద్ద ఏర్పాటు చేసిన ధ్వజ స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.