కోతుల గుంపు దాడి చేయడంతో.. భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. కోతులు వెంబడించడంతో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కిందపడి మానసిక దివ్యాంగ బాలుడు మణికంఠ సాయి (9) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్‌లోని శివాలయం కాలనీలో నివాసం ఉండే కస్తూరి యశోధ భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తూ తన కుటుంబంతో జీవనం సాగిస్తోంది.
యశోదకు మణికంఠ సాయి అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి మతి స్థిమితం సరిగా లేకపోవడంతో.. కూలీకి వెళ్లేటప్పుడు తన వెంట తీసుకెళ్లేంది. ఎప్పటి లాగానే శనివారం నర్సాపూర్‌లోని ఓ ఇంటి నిర్మాణ పనులకు తల్లి యశోద తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లింది. అక్కడ భవనం మొదటి అంతస్తులో తల్లి పనులు చేస్తోంది. ఈ క్రమంలోనే తల్లికి సమీపంలో ఆడుకుంటున్న మణికంఠ సాయిపైకి కోతుల గుంపు దాడి చేసింది. దీంతో భయపడ్డ మణికంఠ భవనంపై నుంచి కిందపడిపోగా.. రాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ ఆ బాలుడు.. అదే రోజు అర్ధరాత్రి మృతి చెందాడు. బాలుడి తండ్రి దత్తు ఏడాది కిందట ఇదే నెలలో 25న చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలవరపరిచింది. కోతుల కారణంగా తరచూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని.. ఇకనైనా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.