తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 7 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ మహబూబాబాద్, జగిత్యాల జిల్లాలకు వైద్య కళాశాలలు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన హామీని నిలబెట్టుకున్నారు. వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
ఇక మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే మంజూరైన వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా కేబినెట్ మంజూరు చేసింది. కొత్తగా 13 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో దాంట్లో 100 బీఎస్సీ నర్సింగ్ సీట్లు రానున్నాయి. ఒక్కో కాలేజీకి రూ. 50 కోట్లు వరకు ఖర్చు అవుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.