మానవ అక్రమ రవాణా.. దక్షిణాదిలో టాప్‌లో తెలంగాణ
2022లో భారతదేశంలో మొత్తం 6,036 మంది అక్రమ రవాణా(హ్యూమన్ ట్రాఫికింగ్) కు గురైనట్లు నివేదించారు. వీరిలో 2,878 మంది పిల్లలు.. 3,158 మంది పెద్దలు ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 March 2024 6:15 AM GMTమానవ అక్రమ రవాణా.. దక్షిణాదిలో టాప్‌లో తెలంగాణ
2022లో భారతదేశంలో మొత్తం 6,036 మంది అక్రమ రవాణా(హ్యూమన్ ట్రాఫికింగ్) కు గురైనట్లు నివేదించారు. వీరిలో 2,878 మంది పిల్లలు.. 3,158 మంది పెద్దలు ఉన్నారు. తాజా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం.. 2021లో 2,189 కేసులు నమోదవ్వగా.. 2022లో మొత్తం 2,250 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఇది 2.8 శాతం పెరిగింది. మానవ అక్రమ రవాణా ద్వారా అనేక మంది బలవంతంగా కొన్ని పనుల్లోకి నెట్టబడడం (3,335), లైంగిక దోపిడీ (1,983), ఇళ్లల్లో చాకిరీ (204), బలవంతపు వివాహం (195)లోకి పంపారు.
దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో అత్యధికంగా మానవ అక్రమ రవాణా కేసులు (704), ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ (293), కేరళ (171), కర్ణాటక (65), తమిళనాడు (5) ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో అనేక మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేయడం లేదు. చాలా ఘటనలు పోలీసుల రాడార్ నుండి తప్పించుకుంటున్నాయి. నమోదు చేసిన కేసుల సంఖ్య చాలా ఎక్కువే.. వాస్తవంగా ఆ సంఖ్య చాలా ఎక్కువ. దేశాన్ని అన్ని రకాల మానవ అక్రమ రవాణాల నుండి విముక్తి చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి సాక్ష్యాలతో చట్టాలను మరింత బలోపేతం చేయడానికి, మానవ అక్రమ రవాణా నుండి బయటపడిన వారి కోసం ILFAT (ఇంటిగ్రేటెడ్ లీడర్‌షిప్ ఫోరమ్ ఎగైనెస్ట్ ట్రాఫికింగ్) పోరాడుతోంది.
2019 చివర్లో ILFAT ను ఏర్పాటు చేశారు. ఈ ఎన్జీవో ప్రస్తుతం ఏడు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్) విస్తరించి ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ రక్కసి నుండి బయటపడిన 4,500 మందికి అండగా ఉంది. త్వరలో మరిన్ని రాష్ట్రాలలో ప్రాణాలతో బయటపడిన వారిని చేర్చాలని ఫోరమ్ యోచిస్తోంది. భారతదేశాన్ని అన్ని రకాల అక్రమ రవాణా, బానిసత్వం, హింస నుండి విముక్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పర్యావరణ వ్యవస్థలో ప్రభుత్వం, మీడియా, పలు సంస్థలతో సహా పలువురితో చేతులు కలిపి పోరాడుతూ ఉంది. ప్రస్తుతం, ఈ సంస్థ మానవ అక్రమ రవాణాపై పాఠశాల విద్యార్థులతో సహా ఎంతో మందికి అవగాహన కల్పించడంపై దృష్టి సారించింది.
కేస్ స్టడీస్:
ILFAT దగ్గర ప్రాణాలతో బయటపడిన వ్యక్తులకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రెండు కేస్ స్టడీస్ ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వారు తమకు జరిగిన దారుణాలపై విజయం సాధించడమే కాకుండా, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఇతరులు అక్రమ రవాణా ఉచ్చులో పడకుండా నిరోధించే లక్ష్యంతో పని చేస్తున్నారు. బాధితులు తమ ప్రయాణాలలో ఎదుర్కొన్న సవాళ్లు, అడ్డంకులను ఇతరులకు తెలియజేస్తూ ఉన్నారు.
తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన జానకి అనే 28 ఏళ్ల యువతి గార్మెంట్స్ అండ్ జనరల్ వర్కర్స్ యూనియన్‌కి కార్యదర్శిగా ఉన్నారు. తన చుట్టూ ఉన్న మహిళలను సమాజాభివృద్ధికి దోహదపడేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమలో పారిశ్రామిక కార్మికులపై జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే ఆమె అంతిమ లక్ష్యం. నా స్వంత అనుభవం నుండి నేను దోపిడీకి సంబంధించిన వివరాలను తెలుసుకున్నానని ఆమె తన ప్రయాణాన్ని వివరిస్తూ చెప్పుకొచ్చారు. “నాకు 19 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, కోయంబత్తూరులోని టెక్స్‌టైల్ పరిశ్రమలో పని చేయమని మా ఇంటి దగ్గర వ్యక్తి చెప్పాడు. మంచి వేతనాలు ఇవ్వడమే కాకుండా.. ఆ పరిశ్రమ యాజమాన్యం తరపున పనితో పాటు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉందని మాట ఇచ్చారు." అని జానకి తెలిపింది. ఎప్పుడు చూసినా తిడుతూ ఉండే వార్డెన్‌లతో పాటు, జానకికి తిరిగే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. ఆమె కుటుంబాన్ని మొబైల్ ఫోన్‌లో సంప్రదించడానికి కూడా అనుమతించలేదు. ఆమె ఇక వెళ్లిపోవాలని అనుకున్నప్పుడు, యాజమాన్యం ఆమెను బయటకు వెళ్లనివ్వలేదు.
“నా తల్లిదండ్రులు సహాయం కోసం ఎన్జీవో ‘READ’ని సంప్రదించిన తర్వాత, వారి బృందం నన్ను వస్త్ర పరిశ్రమ నుండి రక్షించింది. అప్పటి నుండి రీడ్ వివిధ శిక్షణా సెషన్‌లతో నేను ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోగలిగాను. జౌళి పరిశ్రమ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను, అమానవీయ పరిస్థితులను జాతీయ స్థాయిలో తెలియజేయడానికి ILFATలో చేరాను. నాలాంటి నిస్సహాయులైన జానకిలు చాలా మందిని రక్షించడానికి, పునరావాసం పొందేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను” అని జానకి చెప్పుకొచ్చింది.
రజనీ కథ:
విజయవాడలో ప్రేమికుడితో కులాంతర వివాహం చేసుకున్నప్పుడు రజనీకి 17 ఏళ్లు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, అతను తన ఇద్దరు కుమార్తెలను చూసుకోలేక రజనీని విడిచిపెట్టాడు. విపత్కర పరిస్థితులు ఆమెను లైంగిక పనిలోకి నెట్టాయి. ఆమె తీవ్రమైన వేధింపులకు గురైంది. ఆమెను 2018లో కాపాడారు. విముక్తి ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆమె జీవితం కీలక మలుపు తిరిగింది. చివరికి, ఆమె డిప్రెషన్ నుండి బయటపడింది. ILFATలో పని చేస్తున్నప్పుడు మానవ అక్రమ రవాణా, ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల గురించి అవగాహన పెంచడానికి అనేక నైపుణ్యాలను నేర్చుకుంది. ప్రస్తుతం విముక్తి వైస్ ప్రెసిడెంట్‌గా, ILFAT కౌన్సిల్ మెంబర్‌గా పనిచేస్తూ ఉన్నారు. పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమెకు భవిష్యత్తులో అవకాశం వస్తే బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించాలని భావిస్తూ ఉన్నారు.
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వారి మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ల నుండి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)కి అందించిన వార్షిక డేటా ఆధారంగా ఈ సమాచారం అందిస్తున్నాం.