ముత్తంగి గురుకులంలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్
40 Students infected to covid in sangareedy. ముత్తంగి గురుకులంలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్
By అంజి Published on 29 Nov 2021 7:15 AM GMTసంగారెడ్డి జిల్లాలో కరోనా కలవరం రేపుతోంది. జిల్లాలోని ముత్తంగి గురుకుల పాఠశాలలో మహమ్మారి కరోనా విజృంభించింది. పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. గురుకులంలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. 261 మంది విద్యార్థులకు, 27 మంది సిబ్బందికి వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. దీంతో 40 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. దీంతో మిగతా విద్యార్థులకు ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన విద్యార్థుల నమూనాలను వైద్యులు జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపించారు. గురుకులం హాస్టల్‌లోనే విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న 22,356 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మరణించారు. హైదరాబాద్ పరిధిలోని జీహెచ్‌ఎంసీలో 62 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,68,090 మంది కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,989కి పెరిగింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా.శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు యూరప్ దేశాల నుంచి వస్తున్న వాళ్లపై నిఘా పెట్టనున్నామని, వాళ్ళను ట్రేస్ చేయడం, టెస్ట్ చేయడం పై దృష్టి పెడుతామన్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులో నిఘా పెంచుతామని తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా.శ్రీనివాస్ తెలిపారు.