తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGSP)కి చెందిన 39 మంది సిబ్బందిని తెలంగాణ పోలీసు శాఖ ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ సిబ్బంది బెటాలియన్ క్యాంపస్ లోపల, వీధుల్లో నిరసనలలో నిమగ్నమై ఉన్నారు. వివిధ జిల్లాల్లో కానిస్టేబుళ్లు యూనిఫారంలో వీధుల్లోకి రావడం, నిరసనల నేపథ్యంలో ఈ సస్పెన్షన్‌లు జరిగాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ను ప్రయోగించి సస్పెన్షన్ వేటు విధించింది. ఈ మేరకు పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారికి షాక్ ఇచ్చింది. సర్వీసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 39 మంది టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
యూనిఫాం ధరించిన వారిలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, నిరసనలను విరమించుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ సిబ్బందిని కోరారు. ఇటువంటి చర్యల కారణంగా చట్టపరమైన శిక్షలు విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. "ఒక రాష్ట్రం, ఒక పోలీసు" విధానం కోసం ఇటీవల పోలీసు కుటుంబాలు రోడ్ల మీదకు వచ్చాయి.