తెలంగాణలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టగా, తాజాగా ఒక్కసారిగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కేసులు తగ్గిపోయాయని చెప్పుకుంటున్న వారికి ఇదో హెచ్చరిక. కరీంనగర్ జిల్లాలోని చేగుర్తి గ్రామంలో రెండు రోజుల్లో 33 కరోనా కేసులు నిర్దారణ కావడం కలకలం రేపుతోంది. గ్రామంలో రెండు రోజుల పాటు శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు కరోనా పరీక్షలు చేయగా, మొదటి రోజు 16 కేసులు రాగా, రెండో రోజు శుక్రవారం 17 మందికి పాజిటివ్ నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అయితే గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న బంధువులు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. తర్వాత వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా, గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించగా, 16 మందికి పాజిటివ్ తేలింది.
ఇక శుక్రవారం 87 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 17 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు అధికారులు. దీంతో గ్రామంలో మొత్తం 33మందికి కరోనా సోకిందని హెల్త్ సూపర్ వైజర్ బాలయ్య తెలిపారు. వారందరిని హోం క్వారంటైన్‌లో ఉంచి అవసరమైన మందులు అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు కరోనా రోగులకు నిత్యావసర సరుకులను సమకూరుస్తున్నారు. కేవలం అంత్యక్రియలకు హాజరు కావడం వల్ల ఇన్ని పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు.