హైదరాబాద్: తెలంగాణలో మరో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. మామునూర్ ఎయిర్ పోర్టు కోసం సేకరించిన 300 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. బేగంపేట్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డాక్యుమెంట్లను అందజేశారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రామ్మోహన్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే రోజు: భట్టి
మామునూరు ఎయిర్ పోర్ట్‌కు అవసరమైన భూమిని సేకరించి కేంద్ర విమానయాన శాఖ కు గురువారం అప్పగించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్ట్ కు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం అన్నారు. మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయాల నిర్మాణ పనిని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.