సంచలనం..తెలంగాణ సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం పెను సంచలనంగా మారింది.

By -  Knakam Karthik
Published on : 7 March 2026 4:42 PM IST

Telangana, Maoist Surrender, CM RevanthReddy, AOB Maoists, Telangana Police, AK47 Seized, SurrenderPolicy

సంచలనం..తెలంగాణ సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం పెను సంచలనంగా మారింది. గత నెలలో నలుగురు అగ్రనేతలు లొంగిపోయిన దరిమిలా, ఇప్పుడు ఏకంగా 130 మంది కేడర్ జనజీవన స్రవంతిలో కలవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోవడం ఆనవాయితీగా వస్తుండగా, మొదటిసారి నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలో ఈ ప్రక్రియ జరగడం గమనార్హం. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దేవీకి రక్షణగా ఉన్న ప్రొటెక్షన్ టీమ్ సభ్యులతో పాటు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)కి చెందిన కీలక సభ్యులు కూడా ఉన్నారు. వీరు తమతో పాటు ఏకే-47, లైట్ మెషీన్ గన్లు, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్స్ వంటి భారీ మారణాయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు.

ముఖ్యంగా ఈ లొంగుబాటులో విప్లవ రచయితల సంఘం నేత చలసాని ప్రసాద్ కుమార్తె, ఏఓబీ స్టేట్ కమిటీ సభ్యురాలు నవత ఉండటం చర్చనీయాంశమైంది. దీర్ఘకాలంగా ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (AOB) ప్రాంతంలో చురుగ్గా పనిచేసిన ఆమె, ఆ కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున ఆయుధాలు, అగ్రశ్రేణి నాయకత్వ అనుబంధ బృందాలు లొంగిపోవడం రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో శాంతిభద్రతల దిశగా ఒక కీలక మలుపుగా ప్రభుత్వం భావిస్తోంది.

Next Story