మల్లారెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం లేదా.?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో

By Medi Samrat  Published on  8 Nov 2023 1:45 PM GMT
మల్లారెడ్డి కార్యకర్తలను పట్టించుకోవడం లేదా.?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో మొత్తం 11 మంది కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరిలో పలువురు కీలక నేతలు ఉన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట, మూడు చింతలపల్లి మండల మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు వేమూరి విష్ణువర్ధన్ రెడ్డి, కంఠం కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వీరితో పాటు మూడు చింతలపల్లి మండల రైతు బంధు అధ్యక్షురాలు శ్యామల, మాజీ ఎంపీటీసీలు, మంజుల మాధవ రెడ్డి, మగ్గం ప్రతాప్ రెడ్డి, కంఠం రెడ్డి సురేందర్ రెడ్డి, చంద్రకళ సహా మొత్తం 11 మంది నాయకులు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

మంత్రి మల్లారెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వల్లే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నేతలు తెలిపారు. నియోజకవర్గంలోని ఉద్యమ కారులను, సీనియర్లను, కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి కుటుంబ సభ్యులు ప్రతీ మండలంలో రాజకీయం చేస్తున్నారని, అందువల్ల పార్టీ కార్యకర్తలకు విలువ, గుర్తింపు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూ కబ్జాదారులకు ప్రాధాన్యత ఇచ్చి తమకు ఇవ్వడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని సదరు నాయకులు తెలిపారు.

Next Story