హైదరాబాద్‌లోని రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై విచారణ కోసం సభా కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై తెలంగాణ శాసన మండలి సస్పెన్షన్ వేటు వేసింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్సీలు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, తమ సీట్లలో కూర్చోవాలని మండలి ఛైర్మన్ గుత్తా సుకేందర్ రెడ్డి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు శాంతించలేదు. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే కారణంతో, శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తీర్మానం మేరకు వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.