10వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన విద్యార్థిని చదువు కోసం కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెద్దనాన్న ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతోంది. నిన్న ఉదయం ఇంటి వద్ద భోజనం చేయకుండా టిఫిన్స్ బాక్స్‌తో స్కూల్‌కు వెళ్లింది. కాలినడకన వెళ్తూ స్కూల్‌కు దగ్గరలో ఒక్కసారిగా కుప్పకూలింది.
వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు, పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం కనిపించకుండా పోయింది. పరిస్థితిలో మార్పు కనిపించకుండా పోవడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సీపీఆర్ చేస్తూ ట్రీట్మెంట్ అందిస్తుండగానే ప్రాణాలు కొల్పోయిందని స్కూల్ యాజమాన్యం, ఆస్పత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థి శ్రీనిధి ఆకస్మిక మరణంతో.. ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.