SSC Exams : ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
10th class exams from April 3. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఎంతో పగడ్బంధీగా నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 25 March 2023 12:17 PM GMT10th class exams from April 3
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఎంతో పగడ్బంధీగా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 వరకు ఉండనుంది. 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా.. అందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి హాల్‌టికెట్లు పంపిస్తామని అధికారులు తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. డీఈవోలు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పరీక్ష విధులకు నియమించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డుల జారీ వంటి పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
ఆరోగ్య శాఖ ప్రతి పరీక్షా కేంద్రంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్‌లను ఉంచనుంది. పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్‌ఎంను ఉంచనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా TSRTC ఎక్కువ సంఖ్యలో బస్సులను నడుపుతుంది. ప్రిపరేషన్ రోజులలో, పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా చేయనుంది. జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు ముఖ్యమైన సామగ్రిని తరలించేందుకు వాహనాలకు ఎస్కార్ట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.