తెలంగాణ రాష్ట్రంలోని గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు : సీఎం కేసీఆర్

10 percent reservations for tribals in Telangana state. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని

By Medi Samrat  Published on  17 Sept 2022 5:45 PM IST
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు : సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుద‌ల చేస్తామ‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల‌ ఆత్మీయ స‌భ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు విష‌యంలో కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయాం. ఇక విసిగి పోద‌ల్చుకోలేదు. మేం వారం రోజుల్లో గిరిజ‌నుల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమలు చేస్తామని అన్నారు. రాజ్యాంగంలో ఎక్క‌డా కూడా 50 శాతానికి రిజ‌ర్వేష‌న్లు మించొద్ద‌ని లేదు. త‌మిళ‌నాడులో 69 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతున్నాయి. తెలంగాణ‌కు ఎందుకు ఇవ్వ‌డం లేదు. ఎందుకు చేతులు రావ‌డం లేదు. ఈ స‌భ ఏక‌గ్రీవ తీర్మానం చేస్తోంది. మా బిల్లుకు రాష్ట్ర‌ప‌తి ముద్ర వేసి పంపించాల‌ని కోరుతున్నానన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో విద్వేష‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్నారని అన్నారు కేసీఆర్. మాకు వ‌చ్చే న్యాయ‌మైన హ‌క్కు అడుగుతున్నాం. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌లుమార్లు నేను స్వ‌యంగా ప్రధాని నరేంద్ర మోదీని అడిగాను. రిజ‌ర్వేష‌న్లు మా న్యాయం, ధ‌ర్మం అని అడిగాను. ఏపీ నుంచి విడిపోయిన త‌ర్వాత‌ 6 నుంచి 10 శాతానికి గిరిజ‌నులు పెరిగార‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఇవ్వ‌ట్లేదన్నారు. శనివారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 10లో బంజారా, ఆదివాసీల కోసం నిర్మించిన భవనాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.


Next Story