ఓమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణ గ్రామంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌

10 days lockdown in Telangana's gudem village. తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓమిక్రాన్‌ కేసు నమోదైన ఓ గ్రామంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు.

By అంజి  Published on  23 Dec 2021 7:15 AM GMT
ఓమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. తెలంగాణ గ్రామంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌

తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఓమిక్రాన్‌ కేసు నమోదైన ఓ గ్రామంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గూడెం గ్రామంలో ఓమిక్రాన్‌ కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం గల్ఫ్‌ దేశం నుండి ఓ వ్యక్తి తన స్వగ్రామం గూడెంకు వచ్చాడు. అతడికి కరోనా పరీక్షల్లో ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లుగా నిర్దారణ అయ్యింది. దీంతో గూడెం గ్రామంలో ఓమిక్రాన్‌ కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఓమిక్రాన్‌ బాధితుడిని హైదరాబాద్‌లోని టిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు మరో 64 మంది నమూనాలను వైద్యులు సేకరించి.. పరీక్షల నిమిత్తం పంపారు.

కాగా బాధితుడి తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కానీ ఓమిక్రాన్‌ లక్షణాలు మాత్రం లేవని వైద్యులు తెలిపారు. అలాగే వీరి నమూనాలను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌ కోసం పంపారు. ఈ నేపథ్యంలోనే గూడెం గ్రామాన్ని 10 రోజుల పాటు సెల్ప్‌లాక్‌ డౌన్‌ చేశారు. లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ఆ గ్రామ పంచాయితీ తీర్మానం చేసింది.

తెలంగాణలో నిన్న ఒక్క రోజే ఏకంగా 14 ఓమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య 38కి చేరింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో 12 మందికి ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకింది. ప్రమాదకర దేశాల నుండి వచ్చిన మరో ఇద్దరికి ఓమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నమోదైన 38 ఓమిక్రాన్‌ కేసుల్లో కేవలం ఆరుగురు మాత్రమే అత్యంత ప్రమాదకర దేశాల నుండి వచ్చారు. మిగిలిన వారు ప్రమాదరహిత దేశాల నుండి వచ్చారని అధికారులు తెలిపారు.

Next Story