ముఖ్యాంశాలు

  • జీఎస్టీ రాబడిలో తెలంగాణ అగ్రస్థానం
  • ఇప్పటికే రూ.40 వేల కోట్లు దాటిన జీఎస్టీ రాబడి
  • పన్నుల వసూలు కోసం స్పెషల్‌ డ్రైవ్‌లు, ప్రత్యేక యాప్‌లు

హైదరాబాద్‌: జీఎస్టీ రాబడిలో తెలంగాణ రాష్ట్రం టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ప్రతిబంధకాలను ఎదుర్కొంటూ తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. పన్ను వసూళ్లలో ఎలాంటి అవినీతికి తావులేకుండా భారీ లక్ష్యసాధన వైపు అడుగులు వేస్తోంది. స్పెషల్‌ డ్రైవ్‌లు, ప్రత్యేక యాప్‌ల ద్వారా జీరో దందాను నిరోధించి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

గత సంవత్సరం కంటే వృద్ధి రేటు తగ్గినా.. జీఎస్టీ వసూళ్లలో మాత్రం అగ్రస్థానంలోనే ఉంది. రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ అధికారుల చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల అధిక రాబడి చేకూరుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని స్పూర్తిగా తీసుకొని ఇతర రాష్ట్రాలు మెలుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమే జీఎస్టీ రాబడిలో మొదటి స్థానంలో ఉంది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో వాణిజ్యపన్నులు, జీఎస్టీ ద్వారా రూ.47 వేల కోట్లు వస్తుందని అంచనా వేశారు.

అయితే ఈ సారి అంచనాలను దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్‌ అంచనాల్లో 80 శాతం సాధిస్తే గొప్ప విజయం భావిస్తారు. కానీ ఇప్పటికే రూ.40,268 కోట్లు దాటి.. మొత్తం లక్ష్యంలో 86 శాతం దాటింది. గత సంవత్సరంతో పొలిస్తే ఇప్పటికే 6.35 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.45,379 కోట్ల రాబడి రాగా వృద్ధి రేటు 15.37 శాతం నమోదైంది.

ఈ ఆర్థిక సంవత్సరం అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నా అధికారులు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 50 వేల కోట్ల రాబడి సాధించాలన్న లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మిగిలిన 36 రోజుల్లో బకాయిలతో పాటు పన్నుల రూపంలో రూ. 10 వేల కోట్ల వరకు వసూలు చేయాలని అధికారులు నిర్దేశించుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి డివిజన్‌లో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను 30 ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి. జీఎస్టీ చెల్లించకుండా సరుకులు రవాణా చేస్తున్న వాహనాలను అధిక సంఖ్యలో పట్టుకుంటున్నారు. కేవలం వాహనాలను సీజ్‌ చేయడం ద్వారానే రూ.27 కోట్ల పన్ను రాబట్టారు. స్పెషల్‌ డ్రైవ్‌లతో పూర్తి స్థాయిలో అధికారులు జీరో దందాకు చెక్‌ పెడుతున్నారు.

పెరిగిన ట్రేడర్ల, డీలర సంఖ్య..

ఫిబ్రవరి 23 నాటికి రాష్ట్ర జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీతో పాటు మద్యం, పెట్రోల్‌పై వ్యాట్‌ కలిపి మొత్తం రూ.40,268 కోట్ల రాబడి వచ్చింది. జీఎస్టీ ద్వారా రూ.20,618 కోట్లు రాగా, పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ ద్వారా రూ.7,720 కోట్లు వచ్చాయి. మద్యం అమ్మకాలపై వ్యాట్‌ ద్వారా రూ.7,980 కోట్ల వసూలు అయ్యాయి. అయితే ఈ సంవత్సరం వృద్ధిరేటు 13 శాతానికి తగ్గడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం పలురకాలపై వస్తు, సేవలపై జీఎస్టీ రేట్లను తగ్గించింది. దానికి తోడు ఆర్థికమాంద్యంతో రవాణా, వస్తువుల కొనుగోలు తగ్గింది.

రాష్ట్రంలో ఈ సారి డీలర్లు, ట్రేడర్ల సంఖ్య 3.85 లక్షలుగా నమోదైంది. వీరిలో 75 శాతం స్టేట్‌ జీఎస్టీ పరిధిలో ఉండగా, మిగిలిన 25 శాతం మంది కేంద్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. ఈ సారి జీఎస్టీ రాబడి రూ.50 వేల కోట్లు దాటాలన్న లక్ష్యంతో ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.