న్యాయాన్ని అందించే విషయంలో మరోసారి వార్తల్లోకెక్కిన తెలంగాణ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2019 6:43 AM GMT
న్యాయాన్ని అందించే విషయంలో మరోసారి వార్తల్లోకెక్కిన తెలంగాణ..!

ముఖ్యాంశాలు

  • ఏపీ రెండు రంగాల్లో బాగా వెనకబడి ఉందని భారత న్యాయ నివేదిక ఫలితాలు
  • పోలీస్ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం నిరాశాజనకం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యాయాన్ని అందించే విషయంలో రాష్ట్రం మరోసారి వార్తల్లోకెక్కింది. న్యాయాన్ని అందించే విషయంలో తెలంగాణ దేశంలో 11 స్థానంలో ఉంది. ఈ విషయంలో 13వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే కొద్దిగా మెరుగే అయినప్పటికీ ఒక విధంగా ఇది కొద్దిగా ఇబ్బందికరమైన స్థితే అని చెప్పొచ్చు.

తాజాగా విడుదలైన దేశంలో సమగ్రమైన న్యాయాన్ని అందించే రాష్ట్రాలకు సంబంధించిన నివేదికలో తెలంగాణకు 11వ స్థానం దక్కింది. 18 పెద్ద, మధ్యస్థాయి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఈ స్థానాన్ని పొందడం గమనార్హం. న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, జైళ్లశాఖ, న్యాయసేవలు అనే నాలుగు విభాగాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు.

తెలంగాణలో 4.88 శాతం మాత్రమే పూర్తి స్థాయిలో న్యాయం అందుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. పదికి లెక్కగట్టినప్పుడు తేలిన లెక్కలివి. మహారాష్ట్ర 5.92 సగటుతో మొదటిస్థానంలో నిలవగా, 5.85 సగటుతో కేరళ రాష్ట్రం రెండో స్థానంలోనూ, 5.76 సగటుతో తర్వాతి స్థానంలో తమిళనాడు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 4.77 సగటుతో తెలంగాణకంటే 11 పాయింట్ల తక్కువ స్థాయిలో ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణకు 11వ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 స్థానం లభించడం చెప్పుకోవాల్సిన విశేషం. న్యాయ సేవలపరంగా చూస్తే కేరళ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ నాలుగో స్థానంలో నిలవడం విశేషం.

Justice Map

మహిళల భాగస్వామ్యం నిరాశాజనకం

స్థూలంగా చూస్తే ప్రధానమైన విభాగాల్లో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం నిరాశాజనకంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య కేవలం 2.5 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చిచూస్తే ఇది అత్యంత నిరాశాజనకమైన స్థితి అని నిపుణులు అంటున్నారు. అది మాత్రమే కాక జైళ్ల శాఖలోకూడా కేవలం 2.3 శాతం మహిళా ఉద్యోగులు మాత్రమే సేవలందిస్తున్నారు. జాతీయ స్థాయిలోకూడా పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కేవలం 7 శాతం మాత్రమే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలలో 13 శాతం, 12 శాతంమంది మహిళా ఉద్యోగులు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.

మహిళా జడ్జిల నియామకాలను పరిశీలిస్తే తెలంగాణ ఈ విషయంలో దాదాపుగా 44 శాతంతో ముందంజలో ఉంది. కానీ హైకోర్టు స్థాయిలోమాత్రం ఇది కేవలం పది శాతం మాత్రమే. 11.5, 14.5 శాతాలతో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు ఈ విషయంలో చాలా వెనకంజలో ఉన్నాయి.

Justice Rank Overall

కోటా నామమాత్రమే

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల అమలు విషయంలోకూడా కోటా నామమాత్రంగానే అమలవుతున్నట్టుగా నివేదిక గణాం కాలు చెబుతున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవుతున్న దాఖలాలు కనిపించడంలేదని నివేదిక తేటతెల్లం చేసింది.

తెలంగాణలో ఎస్సీ అభ్యర్థులకు కేటాయించిన నియామకాల్లో అధికారుల స్థాయిలో 21 శాతం ఖాళీగానే ఉన్నాయి. ఎస్సీ మరియు ఓబీసీ అభ్యర్థులతో ఈ రిజర్వేషన్ పోస్టుల్నికూడా భర్తీ చేయడంవల్ల ఒక వర్గానికి తీరని అన్యాయం జరుగుతున్నట్టే లెక్క అని నివేదిక పేర్కొంది. అస్సాం, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటుగా తెలంగాణలోకూడా ఓబీసీ అధికారులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కు సంబంధించిన పోస్టుల్లో భర్తీ అవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

Rankd And Score

ఆచరణలో లోపాలు

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థలను ఇప్పటికీ ఏర్పాటు చేసుకోని ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. కానీ జిల్లా స్థాయిలో న్యాయాన్ని అందించే విషయంలోమాత్రం ముందంజలోనే ఉన్నట్టు తెలుస్తోంది. నివేదిక ప్రకారం రాష్ట్ర న్యాయసేవా ప్రాధికార సంస్థద్వారా న్యాయం వేగంగా అందుతున్నట్టుగా నివేదిక స్పష్టం చేసింది. కేరళ, మిజోరం, కర్నాటక రాష్ట్రాలుకూడా ఈ విషయంలో ముందంజలోనే ఉన్నాయి.

పోలీసు శాఖలో తలసరి వ్యయం విషయంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉండడం విశేషం. న్యాయ వ్యవస్థపై పెట్టే ఖర్చుని చూసినట్టైతే కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతోపాటుగా తెలంగాణ రాష్ట్రం ముందంజంలోనే ఉందని ఈ నివేదిక తెలియజేస్తోంది.

Diversity

Next Story