ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ కు అల్లం ఇచ్చిన అతడెవరు?
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2020 11:44 AM GMTతెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నేతగా.. ముఖ్యమంత్రిగా వ్యవహరించే కేసీఆర్ తీరు రోటీన్ కు కాస్త భిన్నమన్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎవరికి అపాయింట్ మెంట్ ఇస్తారో ఒకపట్టాన అర్థం కాని పరిస్థితి. మాయదారి మహమ్మారి రాష్ట్రాన్ని విస్తరిస్తున్న వేళ.. కేసీఆర్ తాజాగా చేసిన పని గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ ను తాజాగా ఒక వ్యక్తి కలిశారు. ఆయన ఇచ్చిన అల్లం పాకెట్ ను ఎంతో ఆనందంగా తీసుకున్నారు. అతడికి అభినందనలు తెలపటమే కాదు.. అతడు చెబుతున్న విషయాల్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. ఇంతకీ ఫాంహౌస్ లో ఉన్న సీఎం కేసీఆర్ ను సదరు వ్యక్తి కలిసే అవకాశం ఎలా వచ్చింది? ఆయన ఇచ్చిన అల్లం పాకెట్ ను సీఎం ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే మరింత ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.
సీజన్ కు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం.. వాటి అమలు దిశగా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం సీఎం కేసీఆర్ కు అలవాటు. ఇటీవల కాలంలో ఆయనో విషయాన్ని అదే పనిగా ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి రైతు రోటీన్ గా వేసే పంటలకు భిన్నంగా.. ప్రభుత్వం చెప్పిన పంటల్ని మాత్రమే వేయాలని.. తద్వారా లబ్థి పొందొచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అయితే.. దీన్ని స్వాగతించే వారే కాదు.. తప్పు పట్టే వాళ్లు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లాలోని రంజోల్ కు చెందిన నాగేశ్వర్ రెడ్డి అల్లం పంటను పండిస్తుంటాడు. జహీరాబాద్ రకం అల్లం పండించే ఆయన.. తాను పండించిన కొంత అల్లాన్ని పాకెట్ గా తీసుకొని సీఎం కేసీఆర్ ను కలిశారు.
వరి.. వేరుశనగ.. మక్కల్.. పత్తి లాంటి పంటలకు భిన్నంగా అల్లం.. బంగాళదుంపలు పండిస్తున్న నాగేశ్వర్ రెడ్డితో పాటు.. మరికొందరు.. వ్యవసాయ అధికారులు సీఎం కేసీఆర్ ను కలిశారు. అల్లం పంట ఎలా వేశావు? విత్తనాలు ఎక్కడివి? ఖర్చు ఎంత? ఆదాయం ఎలా ఉంది? సాగులో సమస్యలు లాంటివి అడిగి తెలుసుకున్న కేసీఆర్.. సదరు రైతు ఇచ్చిన అల్లం పాకెట్ ను అందుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అల్లం.. బంగాళదుంప పంటకు సంబంధించిన అంశాల గురించి అడిగి తెలుసుకోవటమే కాదు.. దాని మార్కెట్.. సాగుకు సంబంధించిన అంశాల్ని అడిగి తెలుసుకోవటం గమనార్హం. ఏమైనా ఇలాంటి భేటీలు సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి.