తెలంగాణలో తలసరి ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. ఈ ఏడాది కూడా తెలంగాణ సంపద గణనీయంగా పెరగడం పట్ల అధికారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అది కూడా కొత్త రాష్ట్రం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుందని అసలు ఊహించరు ఎవ్వరూ..! అయిందంటే.. ఐదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయింది. తెలంగాణలోని 33 జిల్లాల్లో కేవలం 12 మాత్రమే దేశ తలసరి ఆదాయాన్ని దాటలేకపోయాయి.

గతేడాది రూ. 2,04,488గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఈ ఏడాది 11.6 శాతం వృద్ధిరేటుతో రూ. 2,28,216కు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ. 1,35,050కి, వృద్ధిరేటు 6.4 శాతానికి పరిమితమైందని సోషియో ఎకనమిక్‌ ఔట్‌లుక్‌-2020 గణాంకాలు తెలిపాయి.

ఇలాంటి మార్పు రావడానికి కారణమేంటి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ఆదాయాన్ని పెంపొందించడమేనా..? సమాధానం అవుననే చెప్పవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూరల్ ఎకానమీపై బాగా దృష్టి పెట్టింది. పలు కార్యక్రమాలను నిర్వహించి ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించింది. వెల్ఫేర్ స్కీములు, వ్యవసాయానికి కావలసిన చేయూత తెలంగాణ ప్రభుత్వం అందించింది. ముఖ్యంగా తెలంగాణ లో ఐటీ సెక్టార్ అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో భారీగా పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. రాష్ట్రం లోని టైర్-2, టైర్-3 టౌన్లను అభివృద్ధి చేస్తూ ఉండడం కూడా ఆదాయం పెరగడానికి దోహదమైంది.

ఇర్రిగేషన్ ప్రాజెక్టులైన కాళేశ్వరం లిఫ్ట్ ఇర్రిగేషన్ ను వీలైనంత త్వరగా పూర్తీ చేసి.. 24/7 కరెంటును రైతులకు అందించడంతో అగ్రికల్చర్ బూమ్ తెలంగాణలో ఏర్పడింది. రైతులు కూడా లాభపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇర్రిగేషన్ ప్రాజెక్టులు చాలా తొందరగా పూర్తయ్యాయని ఛీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వడం, గొర్రెల పంపిణీ కార్యక్రమాలు, ఆక్వా రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చి ఈ సెక్టార్లలో పనిచేసే వారి ఆదాయం పెరగడానికి కారణమైందని ఆయన అన్నారు.
దేశ తలసరి ఆదాయానికి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయానికి తేడా కేవలం 93,784 రూపాయలని.. అందుకు ముఖ్య కారణం ఐటీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకుని రావడం, టైర్-2 సిటీలలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకుని రావడమేనని రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ అడ్వైజర్ జి.ఆర్.రెడ్డి తెలిపారు. ఐటీ ఉద్యోగుల ఆదాయాలు పెరగడం, అలాగే ప్రైమరీ సెక్టార్ లో ఉన్నటువంటి వారి ఆదాయం కూడా పెరగడం తలసరి ఆదాయం పెరగడానికి కారణమైందని ఆయన అన్నారు.

తెలంగాణ మొత్తం సంపద రూ. 4లక్షల కోట్ల నుంచి రూ. 9,69,604 కోట్లకు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ మొత్తం సంపద ప్రస్తుత ధరల వద్ద రూ. 8,61,031 కోట్లుగా ఉంది. గతేడాది తెలంగాణలో 14.3 శాతంగా నమోదైన జీఎస్డీపీ వృద్ధిరేటు.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 12.6 శాతానికి తగ్గినప్పటికీ రాష్ట్ర సంపద మరో రూ. 1,08,573 కోట్ల మేరకు పెరిగింది. జాతీయ సగటు వృద్ధిరేటు 11 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. స్థిర ధరల ప్రకారంగా చూస్తే మన రాష్ట్ర సంపద రూ. 6,12,828 కోట్ల నుంచి రూ. 6,63,258 కోట్లకు పెరిగింది. గతేడాది 9.5 శాతంగా జీఎస్డీపీ వృద్ధిరేటు 8.2 శాతానికి తగ్గగా.. కేంద్ర జీడిపీ 6.1 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది.

సంపద వృద్ధిరేటులో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. గత అయిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం 14.2 శాతం సగటు వృద్ధిరేటును సాధించింది. తెలంగాణ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, హర్యానా నిలిచాయి. చిన్న రాష్ర్టాలైన సిక్కిం, త్రిపుర 14.4 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ కంటే ముందున్నాయి.

స్థూల జిల్లా ఉత్పత్తి (గ్రాస్‌ డిస్ట్రిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌)లో రూ.1,73,143కోట్లతో రంగారెడ్డి, రూ.1,67,231 కోట్లతో హైదరాబాద్‌ ముందున్నాయి. రూ.6628 కోట్లతో నారాయణపేట, రూ.5934కోట్లతో ములుగు చివరన నిలిచాయి. జిల్లాల స్థాయిలో తలసరి ఆదాయం (డిస్ట్రిక్ట్‌ పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌)లో రూ.5,78,979తో రంగారెడ్డి అగ్రస్థానంలో, రూ.3,57,287తో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచాయి. రూ.1,11,717తో జగిత్యాల, రూ.98,220తో నారాయణపేట చివరిస్థానాల్లో ఉన్నాయి.

స్థిర ధరల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం 10.2 శాతం వృద్ధిరేటుతో పెద్ద రాష్ర్టాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. కర్ణాటక 11 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ కంటే ముందున్నది. జాతీయ సంపదలో తెలంగాణ వాటా గతేడాది 4.29 శాతం ఉండగా.. ఈ ఏడాది 4.52 శాతానికి చేరుకుంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.