డిపోల్లో ఉద్రిక్త పరిస్థితులు.. సీఎం డౌన్ డౌన్‌ అంటూ నినాదాలు..!

By అంజి  Published on  26 Nov 2019 5:57 AM GMT
డిపోల్లో ఉద్రిక్త పరిస్థితులు.. సీఎం డౌన్ డౌన్‌ అంటూ నినాదాలు..!

ముఖ్యాంశాలు

  • తెలంగాణ వ్యాప్తంగా బస్‌ డిపోల ఉద్రిక్తత పరిస్థితులు
  • ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
  • తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతున్న కార్మికులు

హైదరాబాద్‌: డిమాండ్ల సాధన కోసం గత 50 రోజులకుపైగా పోరాడిన ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కార్మికులు భారీగా డిపోల వద్దకు చేరుకున్నారు. కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్ని డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు ఆర్టీసీ డిపోల నుంచి యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి. డిపోల్లో తాత్కాలిక డ్రైవర్‌, కండక్టర్‌ విధులు నిర్వర్తించేందుకు నిరుద్యోగులు క్యూలు కడుతున్నారు. పోలీసుల సహాయంతో డిపోల నుంచి బస్సులు బయటకు వస్తున్నాయి. డిపోల వద్ద ఆందోళన చేస్తున్న పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.

కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం

బండ్లగూడ డిపో వద్దకు భారీగా కార్మికులు చేరుకొని తమను విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. హయత్‌నగర్‌ 1, 2 డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హయత్‌ నగర్‌ డిపో వద్ద తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ డిపో వద్ద ఆందోళన చేస్తున్న 50 మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ డిపో వద్ద విధుల్లో చేరడానికి వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. బర్కత్‌పుర బస్‌ డిపోలో విధులకు హాజరుకావడానికి వచ్చిన 25 మంది కార్మికుల అరెస్ట్‌ అయ్యారు. కార్మికుల ఆందోళనలో కండక్టర్ పద్మావతి (45) స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.

జీడిమెట్ల బస్‌ డిపో వద్ద ఇప్పటి వరకు విధులలోకి చేరడానికి వచ్చిన 20మందికిపైగా ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మికులను జీడిమెట్ పీఎస్‌కు తరలించారు. కార్మికులను ఉద్యోగాల్లో చేరనీయకపోతే మిలిటెంట్ల యుద్ధమే అని జీడిమెట్ల జాక్‌ నాయకులు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను సాదించేందుకు చేస్తున్న సమ్మె 53వ రోజుకు చేరినా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఆక్రమ అరెస్టులు చేస్తుందని జాక్ నాయకులు అన్నారు. విధుల్లో చేరతామని డిపోలోకి వెళ్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారన్నారు. తమ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి పరిష్కారం చూపక పోతే తాము సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడాలన్నారు.

రాణిగంజ్‌ డిపో వద్ద పోలీసులు రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సమ్మె విరమించిన కార్మికులు ఉద్యోగంలో చేరతామంటున్నారు. కాగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున విధుల్లోకి చేర్చుకోబోమని అధికారులు తెలిపారు. రాణిగంజ్ డిపో వద్ద కార్మికులు ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దిల్‌సుఖ్‌నగర్‌ డిపోల వద్దకు చేరుకున్న కార్మికులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి పోలీసులు మలక్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్టీసీ మహిళ కార్మికులు డిపో వద్దకు చేరుకొని విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

విధుల్లో చేరేందుకు వస్తే తమను అరెస్ట్‌లు చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ మొండి వైఖరి వీడాలన్నారు. లేదంటే 45,000 మంది కార్మికుల ఉసురు తాకుతుందని కార్మికులు మండిపడుతున్నారు. విధుల్లోకి తీసుకోండి మహాప్రభో అంటూ ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్నారు. ఉద్యోగంలో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను రాజేంద్రనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఎం డౌన్ డౌన్‌ అంటూ కార్మికులు నినాదాలు చేస్తున్నారు.

Next Story