తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రగతి భవన్‌లో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ నివేదికను గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రూట్లను ప్రైవేటీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, ఆ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది. దీంతో రూట్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. ఆర్టీసీకి సంబంధించిన తాజా పరిణామాలను సీఎం కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు చేపట్టిన సమ్మెను నిన్న విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు నుంచి కార్మికులు విధుల్లోకి చేరాలని ఆర్టీసీ జేఏసీ సూచించింది. అయితే, కార్మికులు సమ్మె విరమించినా.. విధుల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందంటూ ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లోకి రావొద్దని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం తప్పుబట్టారు ఆర్టీసీ ఎండీ. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే..మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని జేఏసీ చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో మంగళవారం విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు పెద్దసంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు కార్మికులను అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. దీంతో తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.