తెలంగాణ కొత్త సీఎస్‌ ఎవరో తెలుసా..?

By అంజి  Published on  4 Dec 2019 4:41 AM GMT
తెలంగాణ కొత్త సీఎస్‌ ఎవరో తెలుసా..?

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నెలాఖరులో శైలేంద్ర కుమార్‌ జోషి పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కీలక పదవైన సీఎస్‌కు పలువురు ఐఏఎస్‌లు పోటీ పడుతున్నారు. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపిక కోసం సీఎం కేసీఆర్‌ చూస్తున్నారు. ఎస్‌కే జోషి 2018 ఫిబ్రవరి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జోషి పదవిని పొడిగించే అవకాశం ఉన్న.. అందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని సమాచారం.

ప్రస్తుతం సీఎస్‌ రేసులో సోమేష్‌ కుమార్‌, సునీల్‌ శర్మ, అజయ్‌ మిశ్రా, బీపీ ఆచార్య, పుష్పాసుబ్రమణ్యం, అధర్‌సిన్హా, బినయ్‌ కుమార్‌, రాజేశ్వర్‌ తివారి, శాలిని మిశ్రా, రాజీవ్‌ రంజన్‌ మిశ్రాలు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఎవరో ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్య అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎస్‌గా రాజీవ్‌ శర్మ పని చేశారు. తర్వాత కె.ప్రదీప్‌ చంద్ర, ఎస్పీసింగ్‌లు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఎస్‌కే జోషి సీఎస్‌తో పాటు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ కొత్త సీఎస్‌ ఎంపిక ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. బీపీ ఆచార్యకు పలు కేసుల్లో సంబంధం ఉంది. రాజీవ్‌ రంజన్‌, బినయ్‌ కుమార్‌, పుష్పాసుబ్రహ్మణ్యం, వసుధామిశ్రాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పలు సర్వీసుల్లో కొనసాగుతున్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన అజయ్‌ మిశ్రాను సీఎం కేసీఆర్‌ సీఎస్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజయ్‌ మిశ్రాపై ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేవు. దీంతో సీఎస్‌ పదవిని ఆయనకు కట్టబెట్టే అవకాశాలున్నాయి.

Next Story