నిధులు ఇవ్వండి.. లేదంటే వాస్తవ పరిస్థితులు చెప్పండి..!

By అంజి  Published on  8 Dec 2019 4:00 AM GMT
నిధులు ఇవ్వండి.. లేదంటే వాస్తవ పరిస్థితులు చెప్పండి..!

కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని లేఖలో సీఎం కేసీఆర్‌ కోరారు. రాష్ట్రానికి జీఎస్టీ తదితర పన్నుల వాట సుమారు రూ.4,531 కోట్లు రావాల్సి ఉందన్నారు. పన్నుల వాటాల ప్రకారం నిధులు ఇవ్వాలని.. లేదంటే వాస్తవ పరిస్థితిని వెల్లడించాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

దేశంలో ఆర్థిక మాంద్యం లేదని చెబుతున్న కేంద్రప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. త్వరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కి వివరించి నిధులను రాబట్టే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల వాట రూ.19,719 కోట్లు రావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.10,558 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయని.. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.224 కోట్లు తక్కువ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో చెప్పిన గణాంకాలే అన్ని విషయాలను సృష్టం చేస్తాయన్నారు. కేంద్ర నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న తమ సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు.

నిధుల మంజూరులో కేంద్రం ఆలస్యం చేస్తోందని లేఖలో తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను వెల్లడించాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు కేటాయించే విధుల్లో కోత విధించాల్సి వస్తోందన్నారు.కేంద్ర లోపభూయిష్ట పరిపాలన విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరస్థితి దిగజారిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖలు తమ కేటాయింపులను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలన్నారు.

రెవెన్యూ, ఆర్థిక అంశాలపై సీఎం కేసీఆర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రమైన వివరాలను అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం పన్నుల వాటాల తగ్గాయని.. ఆయా శాఖలు తమ వ్యయాలను తగ్గించాలని అధికారులకు, మంత్రులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. డిసెంబర్‌ 11న రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రంగా చర్చించనున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటించాలని అధికారులకు, మంత్రులకు సీఎం కేసీఆర్‌ చెప్పారు.

Next Story