చట్టాల్లో విచక్షణాధికారాలే అవినీతికి వనరులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Sept 2020 3:27 PM ISTతప్పులు లేని రికార్డులు, పారదర్శకతే అసలైన సంస్కరణలు
ఒక అడిషనల్ కలెక్టర్ కోటి రూపాయలపైన లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అందులో కొంత తీసుకోకుండా పట్టుకున్నవాడు గొప్ప నీతి వంతుడు. చదివిన వారందరికీ లంచం సొమ్ము మీద ఆసక్తి గాని, ఎందుకు అంత లంచం ఇవ్వడానికి సిద్ధపడ్డారో తెలుసుకొనే ఆసక్తి లేదుTelangana New Revenue Act Analysis. 112 ఎకరాల భూమి అమ్మడానికి వీల్లేని నిషేధిత భూమి జాబితాలో ఉంది. దాన్ని అమ్మడానికి అభ్యంతరం లేదని ధృవ పత్రం ఇవ్వాలనే అధికారం అడిషనల్ కలెక్టర్ కు ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? ఈ అధికారం ఆయనకు ఎక్కడిది? కింది అధికారులైతే లంచం తీసుకుని అభ్యంతరం లేదని సర్టిఫికెట్ ఇస్తారని పై అధికారి అయితే జాగ్రత్తగా నిషేధిత జాబితాలో ఉందో లేదో పరిశీలించి, ససేమిరా అనుమతి నిరాకరిస్తారని చట్టం చేసిన వారు భావించి ఉంటారు.
ఆ నమ్మకాన్ని వమ్ముచేసి అధికారాన్ని ఎకరాకు లక్షరూపాయల రేటు చొప్పున 112 లక్షల రూపాయల లంచం వసూలు చేస్తున్నాడు. లక్ష లంచం ఇచ్చినా కోట్ల లాభం ఉన్న చోట ఎవ్వరూ వెనుకాడని సమాజం మనది. కొంత నగదు కొంత భూమి రూపంలో లంచం వసూలు చేస్తున్నాడాయన. ఆర్డీవో, తాసీల్దార్, జూనియర్ అసిస్టెంట్ కూడ అరెస్టయ్యారు. అంటే కింది స్థాయినుంచి అడిషనల్ కలెక్టర్ దాకా అనేక రకాల అధికారాలను విచక్షణను భూమిమీద ఇవ్వడంవల్లనే వీరు కిలోల కొద్దీ వెండి బంగారాలు, ఎకరాలకొద్దీ భూములను విల్లాలను, కోట్లలంచాలను తీసుకుంటున్నారనడానికి ఇదే రుజువు. విచిత్రంగా అవినీతికి ఆస్కారం ఇచ్చే కొత్త చట్టం వస్తున్నదని తెలిసినా ఈ అధికారులు లంచాలకు పాల్పడ్డారంటే వారి ధనాశ వారిని ఎంతకు ప్రేరేపించిందో అర్థం చేసుకోవచ్చు. పాత చట్టాలు భూధృతరాష్ట్రులకు, భూదుశ్శాసనులకు జన్మనిచ్చే చట్టాలని తేలింది.
మనుషుల మీద నమ్మకం లేక ప్రస్తుతం కంప్యూటర్ ను మాత్రమే నమ్మాలని అనుకుంటున్నాం. చట్టాలు కూడా కంప్యూటర్ ఇంటర్నెట్ నమ్మకం ఆధారంగా చేసుకుంటున్నాం. 22బి కింద నిషేధిత జాబితాలో ఉన్న భూమికి ఎన్ ఓ సి ఇచ్చే అధికారం అడిషనల్ కలెక్టర్లకు ఉండకూడదు. నిషేధిత జాబితాలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ కు ధరణి పోర్టల్ లో ఉన్న ప్రోగ్రాం అంగీకరించకూడదు. ఆ తిరస్కార విధానం వ్యక్తులలో లేనపుడు యంత్రాంగ వ్యవస్థ సిస్టంలో లేనపుడు కనీసం కంప్యూటర్ సిస్టం లో ఉండాలి.
అనుమతి బదులు అందులోంచి ఎర్రరంగులో అభ్యంతరం సర్టిఫికెట్ రావాలి. ఇప్పుడంటే ఎసిబి వారు అవినీతి జరగకుండా ఆపారు. కాని మన వ్యవస్థలోనే ఆ అవినీతికి ఆస్కారం లేని చట్టాలు, యంత్రాంగాలు ఉండాలి. అడిషన్ కలెక్టర్లకు అధికారాలు ఉండకూడదు. ఈ వివాదాలను వినే అధికారం కూడా అడిషనల్ కలెక్టర్లకు ఉండింది. అంటే నిషేధిత భూములను అమ్మారని ఎవరైనా అధికారులమీద ఫిర్యాదు చేస్తే విని విచారించవలసిన పై అధికారి స్వయంగా తప్పు చేశాడన్నమాట. ఇటువంటి అధికారులకు న్యాయవిచారణాధికారం ఇవ్వడం అంటే ఒకో కోటి వసూలు చేసుకోరా బాబూ అన్నట్టే.
రిజిస్టర్ చేసే అధికారాలు, అభ్యంతరం లేదని చెప్పే అధికారాలు, ఆ వివాదాలు వినే అధికారాలు మనుషులకు ఇవ్వకూడదు. ఒకవైపు భూరికార్డులలో పారదర్శకత, మరొకవైపు, విచక్షణాధికారాల తొలగింపు.. ఈ రెండు సాధించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనేకమంది అధికారులు, నిపుణులు, సలహాదారులతో సుదీర్ఘంగా కూలంకషంగా చర్చలు జరిపి చాలా నిక్కచ్చిగా ఏ విధమైన రాజీ లేకుండా గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ అయిదు శాసనాల ద్వారా వ్యవసాయ వ్యవసాయేతర భూముల విషయంలో పాలననుప్రక్షాళనం చేసే కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు.
కింది స్థాయిలో విఆర్వోలు తప్ప మిగిలిన రెవిన్యూ అధికారులు ఉంటారు. వారికి రిజిస్ట్రేషన్ బాధ్యతలు అదనంగా ఇచ్చారు. కాని అధికారాలు లేవు. ఏ చిన్నఅధికారమైనా సరే అవినీతికి మార్గమవుతుందని, బదిలీలు మార్పిడులను, రికార్డులను రహస్యంగా ఉంచితే అవినీతిని ఆపడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి ఈ సంస్కరణల సమీక్షా సమావేశాల్లో పదే పదే చెప్పారు. అంతే కాకుండా, ఒక్కొక్క సెక్షన్ లో, ఒక్కొక్క పదంలో ఏ విధంగా అధికారాలకు ఆస్కారం ఏర్పడుతున్నదో పరిశీలించి, ముఖ్య కార్యదర్శిని, ప్రత్యేక కార్యదర్శిని, సలహాదారులను మాత్రమే కాకుండా, కింది స్థాయి అధికారులను, గ్రామ పంచాయతీ కార్యదర్శులను, మునిసిపాలిటీ అధికారులను, చిన్న పెద్ద అనే స్థాయీ బేధం లేకుండా అందరినీ అడిగి, ఫోన్లు చేసి, ఒకరిద్దరు రిటైరైనారని తెలిస్తే వారిని కూడా పిలిపించి సలహాలు తీసుకుని , చాలా పకడ్బందీగా చట్టాలను తయారు చేయడంలో నిశితమైన శ్రద్ధ చూపారు. (ఈ రచయితతో సహా) అనేక మంది అనధికారులను కూడా అడిగారు. ఒకటికి పదిసార్లు సరి చూసుకున్నారు. అనేక సార్లు సవరణలు చేస్తూ తుది ప్రతి రూపొందించవలసి వచ్చింది. అనేక మంది అధికారులు ఇందులో బాధ్యత వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ ప్రతిసమావేశంలో పాల్గొని చర్చించారు. ఏ నియమం వల్ల ఆచరణలో ఏ పరిణామాలుంటాయో ఫోన్లు చేసి తెలుసుకున్నారు.
ఏ అధికారికైనా విచక్షణాధికారం వినియోగించే అవకాశం చట్టం కల్పిస్తే అక్కడ లంచగొండితనానికి చోటిచ్చినట్టే అవుతుంది. ఈ సూత్రాన్ని కొత్త చట్టం చాటి చెప్పగలగడం విశేషం. అమ్మిన కొన్న వ్యక్తులిచ్చిన పత్రాల ఆధారంగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయవలసిన బాధ్యత మోపడం, వెనువెంటనే మ్యుటేషన్ జరిపి మారిన హక్కుల పత్రాలను ఇవ్వడం కూడా అవినీతికి మార్గాలను మూసేసే నియమమే. పారదర్శకత, జవాబుతారితనంతో అవినీతిని అరికట్టవచ్చునని సమాచార హక్కు చట్టం తెచ్చిన విషయం తెలిసిందే. ఇవిగో ఇవి మీ భూమి రికార్డులు, ఈ విధంగా మార్చుకోవచ్చు అని పారదర్శకంగా జనానికి వెల్లడిస్తామని తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా ప్రకటిస్తున్నది.
కొత్త తెలంగాణా పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం అన్ని రకాల అధికారాలను తొలగించింది. విచక్షణాధికారాన్ని న్యాయంగా వాడబోరన్న అపఖ్యాతిపాలయిన అధికారుల చేతిలో ఇప్పుడు ఏ అధికారం లేదు. ధరణి వెబ్ పోర్టల్ వద్దంటే విక్రయం జరగడానికి వీల్లేదు. పోర్టల్ డేటా అనుమతిస్తేనే క్రయవిక్రయాలు సాగుతాయి.
అవినీతికి మూలాలు చట్టాల్లో రాసుకున్నవాక్యాల్లో ఉంటాయి. ఏ అధికారికైనా విచక్షణాధికారం వినియోగించే అవకాశం కల్పిస్తే లంచగొండితనానికి చోటిచ్చినట్టే. అమ్మిన, కొన్న వ్యక్తులిచ్చిన పత్రాల ఆధారంగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయవలసిన బాధ్యత లేకపోయినా లంచాలు అడుగుతారు. సక్రమంగా అమ్మిన తరువాత మ్యుటేషన్ జరిపి మారిన హక్కుల పత్రాలను ఇవ్వాలనే చట్టం లేకపోయినా అవినీతి విజృంభిస్తుంది. విజృంభిస్తూనే ఉంది.
తప్పుల రికార్డులు
కొన్న పొలం ఎక్కడ ఉందో లేదో తెలుసుకోలేకపోవడం, హద్దులేవో ఖచ్చితంగా అధికారులకే తెలియకపోవడం, ఆ పొలం పైన టైటిల్ పత్రం సంపాదించడం లంచాలతోనే సాధ్యం. సర్కారు వారి దగ్గర రికార్డులు తప్పుల తడకలు. రికార్డు చూపరు. సవరించనీయరు. సమగ్రమైన సర్వే చేయకుండా హద్దులు తేలకుండా, ఎన్ని చట్టాలుచేసినా లాభం లేదు. చట్టాలకేం కొరత లేదు. కనీసం 150 భూమి చట్టాలు ఉన్నాయి.
భూమిశిస్తు (రెవిన్యూ) వసూలు కోసం భూములను రికార్డు చేయడం సర్కారుకు తప్పనిసరి కనుక ఈ శాఖను రెవిన్యూ అన్నారు. భూమి శిస్తు రద్దయినా రెవిన్యూ శాఖ కొనసాగింది. ఈ రికార్డులులోని రెవిన్యూ పరిభాష వారికి మాత్రమే తెలియడంతో వారి ఆధిపత్యం తిరుగులేకుండా పోయింది. పహణి పత్రంలో 33 కాలమ్స్ ఎందుకో, అందులో ఏం రాస్తారో తెలియదు. ఎంత చదివినా భూమి రికార్డులు మాత్రం అర్థం కాని బ్రహ్మపదార్థాలుగా మిగిలిపోయాయి. ప్రతి కాగితానికి వారి చుట్టూ తిరగవలసి రావడం, దాంతో వారు అడిగినంత లంచం ఇవ్వవలసి రావడం తప్పలేదు. పొలాలు కొన్నవారి కష్టాలు చెప్పతరం కాదు. బాగాడబ్బున్నవారు ఇష్టం వచ్చినట్టు లంచాలు ఇచ్చి ఖరీదైన వ్యవసాయ భూములు స్వాధీనంచేసుకుంటున్నారు. భూమి మాఫియాలు ఏర్పడ్డాయి.
అవినీతికి నాలుగు మార్గాలు
భూములు కొని రిజిస్టర్ చేసిన తరువాత కూడా తమ పేరు పట్టాదారులుగా (మ్యుటేషన్) పత్రాల్లో నమోదు కాకపోవడం వల్ల అవినీతి, వివాదాలు, కోర్టు తగాదాలు, ఘర్షణలు, నేరాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి పరిష్కారాలు. 1. తప్పులు లేని పొలం రికార్డులు రూపొందించడానికి సమగ్ర సర్వే జరిపించడం, 2. పొలం హక్కుల వివరాలను, క్రయవిక్రయాల మార్పులను, భూములపై ఉన్న బాకీల సంగతులను రికార్డులలో చేర్చడం, వాటిని ఇంటర్నెట్ పోర్టల్ లో కూడా అందరికీ అందుబాటులో ఉంచడం, 3, అమ్మకం జరిగిన వెంటనే రికార్డులను తదనుగుణంగా మార్చడం, 4, మ్యుటేషన్ హక్కు పత్రాలను వెంటనే రైతులకు ఇవ్వడం జరగాలి. ఇవన్నీ భారీ నిధులతో భారీ ఎత్తున సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత వేగంగా నిర్వహించవలసిన మార్పులు. దానికి చట్టపరమైన పునాదులను కల్పించే చట్టాలను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం ఒక పెద్ద ముందడుగు. ప్రతిగ్రామంలో ఆర్ ఓ ఆర్ (హక్కు పత్రాలు) నవీకరించి సమగ్రంగా ధరణి పేరుతో డిజిటల్ రూపంలో ఉంచాలనే బాధ్యతను ప్రభుత్వంపైన సెక్షన్ 3 ద్వారా నిర్దేశిస్తున్నారు. ఇప్పుడిది ప్రతి ప్రభుత్వం తప్పనిసరిగా చేసి తీరవలసిన బాధ్యత.
అమ్మకం, బహుమతి, తనఖా, మార్పిడి ద్వారా ఆస్తి చేతులు మారితే రిజిస్టర్ చేయడానికి ఆన్ లైన్ ద్వారా టైం స్లాట్ లు ఇవ్వడం, ఆ సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం తప్పనిసరి అని సెక్షన్ 5 నిర్దేశిస్తున్నది.
సాఫ్ట్ వేర్ నిర్మాణం జరగాలి
అమ్మడానికి వీల్లేని ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను ఎవరైనా బదిలీ చేయడానికి ప్రయత్నిస్తే అందుకు అంగీకరించని సాఫ్ట్ వేర్ ను రూపొందించడం ప్రభుత్వం పని. చట్టం అమలు, టెక్నాలజీ అండతో బదిలీ చేయకూడదని భూములరిజిస్ట్రేషన్ నిరోధించడం అవసరం. అందుకు ఆస్కారాన్ని ఈకొత్త చట్టం కల్పిస్తున్నది.
ఎవరైనా కొత్తగా భూమి కొంటే వారికి కొత్త పాస్ బుక్ కం టైటిల్ డీడ్ ఇస్తారు. అమ్మిన వ్యక్తి పాస్ బుక్ లో అమ్మిన భూమిని రికార్డునుంచి తొలగిస్తారు. మారిన వివరాలతో హక్కు రికార్డును నవీకరిస్తారు. మ్యూటేషన్ ను వాయిదా వేసే వీల్లేదు. భూములమీద బకాయలు తనఖాలు ఉంటే వాటి గురించి కూడా రికార్డుల్లో నమోదు చేసి తీరాలి. అవన్నీ ధరణి పోర్టల్ లో కనిపించాలి.
వారసులదే బాధ్యత
వారసత్వంగా వచ్చే మార్పులను కూడా వారసులందరూ వచ్చి అడిగితే ఆమేరకు రికార్డులను తయారుచేసి ఇచ్చే బాధ్యతకూడా రిజిస్ట్రార్ పైన మోపుతూ నియమాలు రూపొందించారు. (సెక్షన్ 6) ఇందుకు వారసులంతా తమ భాగస్వామ్య ఒప్పందం స్వయంగా రిజిస్ట్రార్ కు సమర్పించాలి. ఇందులో లోపాలుంటే వారే బాధ్యత వహిస్తారు. రిజిస్ట్రార్ కు బాధ్యత ఉండదు. వివాదాలు ఉంటే రిజిస్టర్ చేయబోరు. కోర్టు డిక్రీ ఉంటే ఆ ప్రకారం మార్పులు చేస్తారు.
ఇతర వివాదాల్లో డిక్రీద్వారా హక్కులు మారితే ఆ ప్రకారం మార్పులు చేయమని దరఖాస్తు పెట్టుకుని డిక్రీ ప్రతి తో ప్రమాణ పత్రం ఇస్తే ఆ విధంగా మార్పులు చేసి తీరాలి (సెక్షన్ 7) ప్రభుత్వ భూములను మోసపూరితంగా బదిలీ చేస్తూ పాస్ బుక్ జారీ చేస్తే అ అధికారులను బర్తరఫ్ చేస్తామనే హె చరిక సెక్షన్ 8 లో ఉంది. ఇదివరకు ఏ పాస్ బుక్ కూడా లేని వారికి కొత్తగా పాస్ బుక్ ఇవ్వడానికి 10వ సెక్షన్ వీలు కల్పిస్తున్నది.
ఈ విధంగా జారీ చేసిన పాస్ బుక్ లకు తనఖా పెట్టుకునే విలువకూడా ఉంటుందని సెక్షన్ 11 స్పష్టం చేస్తున్నది. బ్యాంకులు ఈ ధరణిలో ఉండే వివరాల ఆధారంగా పాస్ బుక్ ఆధారంగా అప్పులు ఇవ్వవచ్చు. నిరాకరించడానికి వీల్లేదు. పొలం రుణం ఇవ్వడానికి పాస్ బుక్ ఇచ్చితీరాలని అనే అధికారం బ్యాంకులకు లేదని సెక్షన్ 12 నిషేధిస్తున్నది.
తప్పుడు అధికారులకు బర్తరఫ్ శిక్ష
ఏ అధికారి ఎక్కడా తాను నిర్ణయించడానికి ఆస్కారం లేదు. ఒక్కసారి రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే జనం మళ్లీ మళ్లీ అక్కడికి రావలసిన అవసరం ఉందు. రిజిస్టర్ చేయబోనని ఆయన నిరాకరించడానికి గానీ వీల్లేదు. ఏ అధికారి గానీ రికార్డులను తారుమారు చేస్తే అతన్ని బర్తరఫ్ చేయడానికి ఇతర చర్యలు తీసుకుని, క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూషన్ చేయడానికి వీలుంది.
దీంతో తెలంగాణ పట్టేదార్ పాస్ పుస్తకాల చట్టం 1971ను తొలగిస్తారు. అన్ని పత్రాలు, ధరణి, వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిపించి ప్రభుత్వం పత్రం ఇచ్చిన తరువాత మళ్లీ దాని మీద వివాదాలు వింటానని ప్రభుత్వం అనడం అసమంజసం. కనుక ఎం ఆర్ వో ఆర్డీవో, అదనపు కలెక్టర్ లకు ఇకపై వివాదాలు విచారించే అధికారాన్ని తొలగించారు. వారి వద్ద విచారణలో ఉన్న పాతకేసులను కొత్తగా ఏర్పాటు చేసే తాత్కాలిక ట్రిబ్యునల్స్ పూర్తి చేస్తాయి. రెవిన్యూ కోర్టులనేవే ఉండబోవు. (సెక్షన్ 16).
గ్రామపంచాయతీ, గ్రేటర్ హైదరాబాద్, మునిసిపాలిటీ చట్టాలను కూడా సవరించి వెనువెంటనే మ్యుటేషన్ జరిపి కొత్త కాగితం ఇవ్వాలనే నియమాలతో కొత్త చట్టాలను కూడా ప్రవేశ పెట్టారు.
రెవిన్యూ విలేజ్ ఆఫీసర్లు (విఆర్వో)ఇకపై రెవిన్యూ విధులు ఉండవు. వారిపై అధికారులకు రెవిన్యూ బాధ్యతలు ఉంటాయి కాని అధికారాలు ఉండవు. మూడు సమూలమైన మార్పులను ఈ చట్టాలు చేస్తున్నాయి. ఒకటి – ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులలో పారదర్శకత. రెండు – అధికారుల విచక్షణాధికారం తొలగింపు, మూడు – రెవిన్యూ కోర్టుల రద్ధు.
ఒక్కొక్క సెక్షన్ లో, ఒక్కొక్క పదంలో ఏ విధంగా అధికారాలకు ఆస్కారం ఏర్పడుతున్నదో పరిశీలించి, ముఖ్య కార్యదర్శిని, ప్రత్యేక కార్యదర్శిని, సలహాదారులను మాత్రమే కాకుండా, కింది స్థాయి అధికారులను, గ్రామ పంచాయతీ కార్యదర్శులను, మునిసిపాలిటీ అధికారులను, చిన్న పెద్ద అనే స్థాయీ బేధం లేకుండా అందరినీ అడిగి, ఫోన్లు చేసి, ఒకరిద్దరు రిటైరైనారని తెలిస్తే వారిని కూడా పిలిపించి సలహాలు తీసుకుని , చాలా పకడ్బందీగా చట్టాలను తయారు చేయడంలో నిశితమైన శ్రద్ధ చూపారు. (ఈ రచయితతో సహా) అనేక మంది అనధికారులను కూడా అడిగారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ ప్రతిసమావేశంలో పాల్గొని చర్చించారు. సమగ్రమైన సర్వే పూర్తి చేసి, పటిష్టమైన సమర్థవంతమైన పోర్టల్ ను రూపొందించగలిగితే చట్టం చెప్పిన మార్పులు విజయవంతమవుతాయి.
- ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, డీన్, బెన్నెట్ యూనివర్సిటీ, మాజీ కేంద్ర సమాచార కమిష్నర్